Harry Potter author JK Rowling receives death threat: ప్రముఖ రచయిత్రి, హ్యారీ పోటర్ రచయిత జేకే రౌలింగ్ కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఇటీవల దాడికి గురైన ప్రముఖ రచయిత, బుకర్ ఫ్రైజ్ విన్నర్ సల్మాన్ రష్దీ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ ప్రస్తుతం చాలా అనారోగ్యంగా అనిపిస్తోంది.. అతను త్వరగా కోలుకోనివ్వండి’’ అంటూ సల్మాన్ రష్దీ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అయితే దీనికి స్పందనగా ఓ నెటిజెన్ ‘‘ చింతింకండి.. తరువాత మేరు’’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ట్విట్టర్ ఖాతా పేరు మీర్ ఆసిఫ్ అజీజ్ గా ఉంది. ఈ బెదిరింపు వ్యాఖ్యలను రౌలింగ్ స్కీన్ షాట్ తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఇటీవల సల్మాన్ రష్దీపై దాడి చేసిన హాదీ మాటర్ ను ప్రశంసిస్తూ ట్వీట్స్ కూడా చేశాడు. ఈ బెదిరింపుల అనంతరం ఆమె మరో ట్వీట్ చేశారు. ట్విట్టర్ ను నిందిస్తూ ఇవి మీ మార్గదర్శకాలు.. సరైనవా..? అంటూ ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సల్మాన్ రష్దీ కోలుకుంటున్నారు. రష్దీకి వెంటిలేటర్ తొలగించారు. ఇటీవల న్యూయార్క్ స్టేట్ లో ఓ సభలో ప్రసంగిస్తున్న సమయంలో హాదీ మాటర్ అనే నిందితుడు విచక్షణారిహితంగా కత్తితో పొడిచారు. దీంతో మెడపై, కాలేయంపై, కంటిపై తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే రష్దీని ఎయిర్ అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఓ కంటిని కోల్పయే అవకాశం ఉందని.. చేతిలో నరాలు తెగిపోయాయని వైద్యులు చెబుతున్నారు.
Read Also: Rakesh Jhunjhunwala: “ఇండియా వారెన్ బఫెట్” ఇక లేరు.. రాకేష్ ఝున్ ఝున్ వాలా హఠాన్మరణం
సల్మాన్ రష్దీ 1988లో రచించిన ‘ సాతానిక్ వర్సెస్’ పుస్తకంపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పుస్తకంలో దైవదూషణ ఉందని.. ఈ బుక్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మెజారిటీ ముస్లిం కంట్రీస్ లో ఈ పుస్తకాన్ని బ్యాన్ చేశారు. ఇరాన్ అయితే సల్మాన్ రష్దీని హతమార్చడానికి ఏకంగా ఫత్వా జారీ చేసింది. అప్పటి నుంచి సల్మాన్ రష్దీ లో ప్రొఫైల్ జీవితం గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయనపై దాడి చేసిన వ్యక్తిని ఇరాన్ లో కీర్తిస్తున్నారు. ఇరాన్ పత్రికలు ఏకంగా హాదీ మాటర్ ను హీరోగా కీర్తిస్తోంది.