Srilanka Crisis- Gotabaya Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఊరట లభించింది. మరో రెండు వారాల పాటు సింగపూర్ లో ఉండేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం గొటబాయ రాజపక్స సింగపూర్ లో టూరిస్ట్ వీసాపై నివాసం ఉంటున్నాడు. ఇటీవల శ్రీలంక క్యాబినెట్ అధికార ప్రతినిధి బంధుల గుణవర్థన మాట్లాడుతూ.. గొటబాయ రాజపక్స ఎన్నో రోజులు సింగపూర్ లో ఉండలేడని.. త్వరలోనే శ్రీలంకకు వస్తారని అన్నారు.
శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో అక్కడి ప్రజలు ఆందోళనలు,నిరసనలు తెలియజేస్తున్న తరుణంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన అధ్యక్ష నివాసాన్ని వదిలి ఆర్మీ విమానంలో మాల్దీవులకు అక్కడి నుంచి జూలై 14న సింగపూర్ పారిపోయారు. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న గొటబాయ రాజపక్సకు స్వల్పకాలిక విజిట్ పాస్ ను అందించింది. ప్రస్తుతం దీన్ని మరో 14 రోజులకు పొడగించినట్లు స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక వెల్లడించింది. ఇప్పటికే సింగపూర్ తాము రాజపక్సకు ఆశ్రయం ఇవ్వలేదని, ఆయన ఆశ్రయం కోరలేదని చెప్పింది.
Read Also: Bloomberg Survey: ఇండియాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం “జీరో”.. ఈ దేశాల్లో పరిస్థితి దారుణం
శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దిగజారడానికి రాజపక్స కుటుంబీకులే కారణం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ ప్రధాని మహిందా రాజపక్సతో పాటు మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్స, సెంట్రల్ బ్యాంక్ మాజీ గవర్నర్ అజిత్ కబ్రాల్ దేశం వదిలి వెళ్లకుండా శ్రీలంక సుప్రీం కోర్టు నిషేధం విధించింది. మార్చి నెలలో శ్రీలంకలో నిత్యావసరాల ధరలు పెరగడంతో ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. దీంతో రాజపక్స కుటుంబీకులు తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేసి పెద్ద ఉద్యమాన్ని చేశారు. దీంతో వేరే పరిస్థితి లేక ముందు ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్స రాజీనామా చేశాడు. తరువాత అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పదవిని వదిలాడు. 2.2 కోట్ల జనాభా ఉన్న శ్రీలంకకు మొత్తం 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు ఉన్నాయి.