Giorgia Meloni: బిలియనీర్ జార్జ్ సోరోస్ విదేశాల రాజకీయాల్లో జోక్యానికి పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇత దేశాల రాజకీయాల్లో కలుగుజేసుకుంటున్నారని ఆమె అన్నారు. దేశాలను అస్థిరపరచడానికి తన డబ్బును ఉపయోగిస్తున్నారని మెలోనీ గురువారం అన్నారు. యూరప్ రాజకీయాల్లో ఎలాన్ మస్క్ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు, విమర్శలు వస్తున్న తరుణంలో మెలోనీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో యూరప్‌లో రాజకీయాల గురించి ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ఏ విధంగా ముప్పు కలిగించవని ఆమె చెప్పారు. ఎలాన్ మస్క్ తన వాక్ స్వేచ్ఛను మాత్రమే ఉపయోగించుకున్నారని చెప్పారు. అతను ధనవంతుడు, వామపక్షవాది కాకపోవడం కారణంగా టార్గెట్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు.
జార్జ్ సోరోస్‌ని ఉదాహరణగా తీసుకుని, ‘‘వామపక్ష భావాలు కలిగిన ధనవంతులు, శక్తివంతమైన వ్యక్తులు ఇతర ప్రజాస్వామ్య దేశాల రాజకీయాల్లో ఎలా జోక్యానికి పాల్పడ్డారో అందరికి తెలిసిందే, జార్జ్ సోరోస్ అలాంటి పనులే చేస్తాడు, మస్క్ ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించడు’’ అని కామెంట్ చేసింది. సోరోస్ నుంచి డబ్బు తీసుకున్న వారిలా కాకుండా తాను ఎలాన్ మస్క్ నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదని మెలోని చెప్పారు. ఇటలీలోని తన ప్రభుత్వం ఎలోన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌తో ఒక భారీ, వివాదాస్పద సైబర్ భద్రతా ఒప్పందంపై సంతకం చేయబోతోందనే మీడియా నివేదికలను కూడా ఆమె ఖండించారు.
ఇటీవల ఎలాన్ మస్క్ యూరప్ దేశాలకు చెందిన పలువురు నేతల్ని టార్గెట్ చేశారు. ముఖ్యంగా వామపక్ష భావాజాలాలు ఉన్న యూకే ప్రధాని కీర్ స్టార్మర్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌ని లక్ష్యంగా చేసుకుని విమర్శించారు. ఇటీవల యూరప్‌లో జరిగిన పలు మతోన్మాద దాడులకు ఈ భావజాలమే కారణమని ఆరోపించాడు. రైటిస్ట్ లీడర్లను ఎన్నుకోవాలని యూరప్ ప్రజల్ని కోరారు.
ఇదిలా ఉంటే, భారత్ కూడా జార్జ్ సోరోస్ వ్యవహారంపై పలు సందర్భాల్లో ఆరోపణలు చేసింది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్-జార్జ్ సోరోస్ మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తోంది. ఈ శీతాకాల సమావేశాల్లో జార్జ్ సోరోస్ అంశంపై రాజకీయాలు నడిచాయి. సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీకి అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. కాశ్మీర్‌ని స్వతంత్ర దేశంగా భావించేందుకు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించిన సంస్థతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది.