Zimbabwe: ఆఫ్రికా దేశాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయి. కరువు పరిస్థితులతో ఆయా దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా బాటలోనే జింబాబ్వే నడుస్తోంది. అధికంగా ఉన్న ఏనుగుల జనాభాని నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా 200 ఏనుగులను చంపనున్నట్లు ప్రకటించింది. ఏనుగులను చంపాలని జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ అథారిటీ (జిమ్‌పార్క్స్)ని ప్రభుత్వం ఆదేశించింది.
జింబాబ్వేలో ఏనుగులు ఎక్కువగా ఉండే హ్వాంగే నేషనల్ పార్కులోని ఏనుగులను చంపడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో తీవ్ర పరిస్థితులు నెలకొనడంతో ఇప్పటికే ఈ ఏడాది 160 ఏనుగులు మరణించాయి. మానవ-ఏనుగుల సంఘర్షణలు, ఆహార భద్రతను సమతుల్యం చేయాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతూ జింబాబ్వే పర్యావరణ మంత్రి, సిథెంబిసో న్యోని ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తాము నమీబియా విధానాన్ని తీసుకున్నామని, ఏనుగులను చంపడంతో పాటు వాటి మాంసాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పారు.
Read Also: Kolkata Doctor Case: వైద్యుల డిమాండ్లకు తలొగ్గిన మమతా బెనర్జీ.. కోల్‌కతా టాప్ కాప్ తొలగింపు..
లక్షకు పైగా ఏనుగుల కలిగిన రెండో అతిపెద్ద దేశంగా జింబాబ్వేకి పేరుంది. ఒక్క హ్వాంగే నేషనల్ పార్కులోని 65000 ఏనుగులు ఉన్నాయి. ఇది దాని సామర్థ్యానికి మించిపోయింది. దేశంలో చివరిసారిగా 1988లో ఏనుగులను చంపే ఆపరేషన్ నిర్వహించారు. జింబాబ్వేకి పొరుగున ఉన్న నమీబియాలో కూడా కరువు తీవ్రంగా ఉంది. దీంతో 83 ఏనుగులతో సహా 160 వన్యప్రాణుల్ని చంపేసింది.
దేశ అడవుల్లో సంచరించే 700 అరుదైన అడవి జంతువులను వధించి.. ఆ మాంసం ప్రజలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా 83 ఏనుగులు, 30 హిప్పోలు (నీటి గుర్రాలు), 60 అడవి దున్నలు, 50 ఇంపాలాలు, 100 బ్లూ వైల్డ్ బీస్ట్, 300 జీబ్రాలను చంపబోతున్నట్లు ప్రకటించింది. ఆకలితో అలమటిస్తున్న ఆ దేశ ప్రజలకు వీటి మాంసాన్ని పంపిణీ చేస్తామని చెప్పింది.