Site icon NTV Telugu

Covid 19: మొదటి కరోనా కేసుకి 5 ఏళ్లు.. చైనా ఏం చెబుతోందంటే..?

Covid 19

Covid 19

Covid 19: ఇప్పుడున్న జనరేషన్ కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కొంది. మానవ చరిత్ర కలరా, ప్లేగు, స్పానిష్ ఫ్లూ వంటి ఎన్నో మహమ్మారులను ఎదుర్కొంది. అయితే, వైద్యం అభివృద్ధి చెందడంతో చాలా ఏళ్లుగా మహమ్మారి అనే పేరు వినిపించలేదు. అయితే, 2019లో చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్, కోవిడ్-19 మహమ్మారికి కారణమైంది. తొలి కరోనా కేసులు వెలుగులోకి వచ్చి నేటికి 5 ఏళ్లు గడిచాయి. డిసెంబర్ 31, 2019 తొలి కోవిడ్ కేసు నమోదైంది. ముందుగా దీనిని ‘‘ వైరల్ న్యూమోనియా’’ అని పిలిచారు. ఆ తర్వాత కరోనా వైరస్ ద్వారా వచ్చే కోవిడ్-19 అని గుర్తించారు. భారతదేశంలో తొలి కేసు జనవరి 30, 2020లో కేరళలో నమోదైంది. త్రిసూర్‌కి చెందిన నివాసి వూహాన్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాడు.

Read Also: Manipur Violence: “క్షమించండి”.. మణిపూర్ హింసపై సీఎం బిరెన్ సింగ్

ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లో కూడా కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటలీ, అమెరికా, భారత్, చైనా ఇలా ప్రముఖ దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మానవ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దేశాలకు దేశాలు తమ సరిహద్దుల్ని మూసేశాయి. ప్రజలు ‘‘లాక్‌డౌన్’’ వల్ల ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రపంచం దీనిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ల త్వరితగతిన తీసుకువచ్చాయి. అయినప్పటికీ ఇప్పటికీ పలు దేశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

అయితే, కోవిడ్-19కి సంబంధించి మరింత సమాచారం పంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పిలుపునిచ్చింది. దీనికి ప్రతిస్పందగా తమ వద్ద ఉన్న కోవిడ్-19 డేటా, పరిశోధన ఫలితాలన్నింటిని పంచుకున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో ట్రేసబిలిటీ పురోగతిని పంచుకోవడానికి నిపుణులను ఏర్పాటు చేసిన ఏకైక దేశం చైనానే అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 76 కోట్లకు పైగా కోవిడ్-19 కేసులు, 6.9 మిలియన్ మరణాలు నమోదయ్యాయని తెలిపింది.

Exit mobile version