Site icon NTV Telugu

Low birth rate: ‘‘ప్లీజ్ ఎక్కువ మంది పిల్లల్ని కనండి’’.. ప్రజల్ని వేడుకుంటున్న 5 దేశాలు..

Low Birth Rate

Low Birth Rate

Low birth rate: ప్రపంచ వ్యాప్తం పలు దేశాలు జనాభా క్షీణతను ఎదుర్కుంటున్నాయి. ప్రతీ ఏడాది ఆ దేశాల్లో జననాల రేటు తగ్గుతోంది. దీంతో ప్రభుత్వమే ప్రజలు పిల్లలు కనేలా ప్రోత్సహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జననాల రేటు పడిపోవడంతో చాలా దేశాలు ఇప్పుడు వృద్ధ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.

టర్కీ: టర్కీలో జననాల రేటు 2001లో 2.38 ఉంటే, 2025 నాటికి 1.48కి పడిపోయింది. ఈ సంఖ్య ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా కన్నా తక్కువ. ఈ పరిస్థితిపై అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగన్ తన ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ స్థితి ‘‘యుద్ధం కన్నా భయంకరమైనది’’గా అభివర్ణించారు. 2026 నుంచి కుటుంబ దశాబ్దాన్ని ప్రారంభించాలని ప్రకటించాడు. కొత్త జంటలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వియత్నాం: వియత్నాం గత దశాబ్దాల నాటి ‘‘ఇద్దరు పిల్లల’’ విధానాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ప్రజలు ఎంత మంది పిల్లలు కావాలంటే అంతమందిని కొనొచ్చని చెప్పింది. 99 నుండి 2022 వరకు సగటు జనన రేటు 2.1గా ఉంది, కానీ 2024లో అది 1.91కి పడిపోయింది. జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్ దేశాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది.

చైనా: చైనా గత కొన్నేళ్లుగా జనాభా సంక్షోభాన్ని అనుభవిస్తోంది. యువ జంటలు పెళ్లిళ్లకు, పిల్లలు కనేందుకు ఇష్టపడటం లేదు. ఫలితంగా డ్రాగన్ దేశంలో వృద్ధ జనాభా పెరుగుతోంది. ఈ శతాబ్దం చివరి నాటికి ఇది 1.4 బిలియన్ల నుండి 800 మిలియన్లకు తగ్గవచ్చునే అంచనా ఉంది. ప్రభుత్వమే ప్రజలకు ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహిస్తోంది.

న్యూజిలాండ్: 2023లో న్యూజిలాండ్ జనన రేటు రికార్డు స్థాయిలో 1.56కి చేరుకుంది. దేశంలో 15 నుంచి 49 ఏళ్ల మహిళల సంఖ్య పెరిగింది, కానీ పిల్లల సంఖ్య తగ్గింది. 2022లటో ఈ రేటు 1.66గా ఉంది. అయితే, ప్రస్తుత జనాభాను నిర్వహించడానికి అవసరమైన 2.1 శాతం కన్నా తక్కువ.

ఉత్తరకొరియా: ఉత్తర కొరియా కూడా జననాల రేటు 1.78. ఈ రేటు దక్షిణ కొరియా, జపాన్, చైనా కన్నా ఎక్కువ. కానీ అవసరమైన 2.1 శాతం కన్నా తక్కువ. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే కిమ్ రాజ్యంలో కార్మికుల కొరత తీవ్రంగా ఏర్పడే అవకాశం ఉంది.

Exit mobile version