భూకంపంలో తీవ్రంగా దెబ్బతిన్న అఫ్గానిస్థాన్‌లో దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి మానవతాసాయం అందింది. గురువారం రాత్రి భారత్ నుంచి విమానంలో అవసరమైన పరికరాలు, సామగ్రిని అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు తరలించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. సామగ్రితో వారికి సాయం అందించేందుకు సాంకేతిక బృందం కూడా వెళ్లినట్లు తెలిపింది. ఈ నేపథ్యం భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న అఫ్గాన్‌ను ఆదుకున్న తొలిదేశంగా భారత్ నిలిచింది. భారత్ నుంచి వెళ్లిన బృందం తాలిబన్లతో కలిసి సాయం పంపిణీని పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక బృందం భద్రత గురించి తాలిబన్ల నుంచి పలుమార్లు హామీ వచ్చాకే అక్కడికి మనదేశానికి చెందిన బృందం పయనమైంది.
ఇప్పటికే ఉగ్రదాడులు, తాలిబన్ల దాడులతో కుదేలైన అఫ్గాన్‌కు భూకంపంలో మరో ఆపద వచ్చిపడింది. భూకంపంలో భారీ ఎత్తున ఇళ్లు ధ్వంసం కాగా.. చాలా మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వారికి తగిన వైద్య సదుపాయాలు అందే పరిస్థితి కూడా అక్కడ లేదు. ఈ దుర్భర పరిస్థితుల నేపథ్యంలో భారత్ అఫ్గాన్‌కు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. భారత్ సాయానికి అఫ్గాన్‌లోని తాలిబన్ సర్కారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల భారత పొరుగు దేశమైన అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంప సంభించిన విషయం తెలసిందే. ఈ భూకంప ధాటికి వెయ్యిమందికి పైగా మృతి చెందారు. అంతేకాకుండా సుమారు పదిహేను వందల మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద చాలా మంది సజీవ సమాధి అయ్యారు. అయితే.. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో.. సహాయక చర్యలు కూడా ముందుకు సాగలేకపోతున్నాయని అక్కడి అధికారులు అంటున్నారు. భూకంపం ఎఫెక్ట్‌కు ఖోస్ట్ ప్రావిన్స్ స్పెరా జిల్లాలో ఎక్కువ భాగం దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. గియాన్ జిల్లాలో ఘోరమైన ప్రాణ నష్టం వాటిల్లింది.