ఉక్రెయిన్ లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై వివరణ ఇచ్చింది కేంద్ర విదేశాంగ శాఖ. విద్యార్థులు బందీలుగా ఉండటంపై మాకు ఎలాంటి నివేదికలు అందలేదు. ఉక్రెయిన్‌లోని ఇండియా ఎంబసీ భారతీయ పౌరులతో నిరంతరం టచ్‌లో ఉంది. ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు నిన్న ఖార్కివ్ నుండి బయలుదేరారు. భారత పౌరుల తరలింపునకు ఉక్రేనియన్ అధికారులు అందించిన సహాయాన్ని అభినందిస్తున్నాం. భారతీయుల తరలింపులో సహకారం అందిస్తున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ధన్యవాదాలు తెలిపింది విదేశాంగ శాఖ.ఇదిలా వుంటే గత మూడు రోజుల్లో 5వ సారి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ప్రధాని మోడీ. ఉక్రెయిన్ లో పరిణామాలపై అధికారులతో చర్చించారు ప్రధాని మోడీ. భారతీయ విద్యార్థులను క్షేమంగా తరలించేందుకు సహకరించాలని పుతిన్ ను కోరారు ప్రధాని మోడీ. ఈమేరకు ప్రధాని మోడీ పుతిన్ కి ఫోన్ చేసి మాట్లాడారు.
మరోవైపు ఉక్రెయిన్ సరిహద్దుల్లోని భారతీయులను తరలించే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూనే వుంది. C 17 విమానం ఉక్రెయిన్ నుండి భారతదేశానికి చేరుకుంది, ఇప్పటి వరకు 17,000 మంది భారతీయులు అక్కడి నుంచి ఖాళీ చేయబడ్డారు. ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగడంతో ఆపరేషన్ గంగ వేగంగా కొనసాగుతోంది.
