NTV Telugu Site icon

Ozone Layer: ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్లతో ఓజోన్ పొరకు ప్రమాదం.. సైంటిస్టుల వార్నింగ్..

Starlink

Starlink

Ozone Layer: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం ‘‘స్టార్‌లింక్‘‘ శాటిలైట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. చిన్న యాంటెన్నా సాయంతో ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా సులభంగా ఇంటర్నెట్ సేవలు అందించే ఉద్దేశంతో అంతరిక్షంలోని స్టార్‌లింక్ శాటిలైట్లను పంపారు. అయితే, ఈ శాటిలైట్లు భూమిని రక్షిస్తున్న ఓజోన్ లేయర్‌ని దెబ్బతీసే అవకాశం ఉందని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. జర్నల్ జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ వాతావరణంలో అధిక మొత్తంలో అల్యూమినియం ఆక్సైడ్ వాయువును వెదజల్లుతుందని, అది ఓజోన్ పొరను క్షీణింపజేస్తుందని పేర్కొంది.

సూర్యుడి నుంచి వచ్చే అతినీలతోహిత కాంతిని ఓజోన్ పొర అడ్డగించి సమస్త జీవజాలాన్ని రక్షిస్తుంది. ఒక వేళ ఈ పొర క్షీణిస్తే భూమిపై ఉన్న జంతువులు, వృక్షజాలానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. మనుషులు, జంతువులకు చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పంటల దిగుబడి, ఆహార ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది.

Read Also: MSP: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు..

స్టార్‌లింక్ శాటిలైట్లు దిగువ భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయి. ఈ ఇంటర్నెట్ శాటిలైట్ల జీవితకాలం దాదాపు 5 ఏళ్లు. ప్రస్తుతం లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో 8000 కంటే ఎక్కువ ఇంటర్నెట్ ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 6000 స్టార్‌లింక్ శాటిలైట్లే. వీటి జీవితకాలం ముగిసిన సందర్భంలో ఇవి భూమిపై కూలిపోతాయి. అయితే, భూ వాతావరణ ఘర్షణ కారణంగా ఇవి భూమి పైకి చేరేలోపే కాలిపోతాయి. దీని ఫలితంగా ఏటా 1000 టన్నుల అల్యూమినియం ఆక్సైడ్స్ వెలువడుతాయి. ఓ విధంగా చెప్పాలంటే 646 శాతం ఈ వాయువుల పెరుగుదల ఉంటుంది. అల్యూమినియం ఆక్సైడ్‌లు ఓజోన్‌ను క్లోరిన్‌తో విధ్వంసకర చర్యకు కారణమవుతాయి.

లోయర్ ఎర్త్ ఆర్బిట్ నుంచి శాటిలైట్లు కూలిపోయేందుకు భూ వాతావరణంలోకి వచ్చే సమయంలో అవి కాలిపోయి అల్యూమినియం ఆక్సైడ్ లను ఉత్పత్తి చేస్తాయి. ఇది స్ట్రాటో ఆవరణలోని ఓజోన్ పొరను క్షీణింపచేసి క్లోరిన్ యాక్టివేషన్ క్రిష్టల్స్ విడుదలవుతాయని పరిశోధకులు చెప్పారు. సాధారణంగా 250 కిలోల శాటిలైట్ సుమారుగా 30 కిలోల అల్యూమినియ ఆక్సైడ్ నానో పార్టికల్స్‌ని ఉత్పత్తి చేస్తుందని కనుగొన్నారు. ఇది దశాబ్ధాలుగా వాతావరణంలో ఉంటాయి. 2016 మరియు 2022 మధ్యకాలంలో ఆక్సైడ్ల ఉనికి దాదాపు ఎనిమిది రెట్లు పెరిగిందని మరియు ప్రస్తుత ఉపగ్రహ ప్రయోగ ప్రణాళికలతో మరింత పెరగవచ్చని అధ్యయనం కనుగొంది. స్పేస్ ఎక్స్ మాత్రమే మరో 42,000 స్టార్‌లింక్ శాటిలైటన్లను ప్రయోగించడానికి అనుమతి కలిగి ఉంది. రాబోయే ఏళ్లలో వేలాది శాటిలైట్లనను ప్రయోగించాలని ప్లాన్ చేస్తోంది.