NTV Telugu Site icon

Ebola outbreak: ఉగాండాలో “ఎబోలా” కల్లోలం.. లాక్‌డౌన్ విధింపు

Ebola Virus

Ebola Virus

Ebola outbreak in Uganda: ఆఫ్రికా దేశం ఉగాండాలో ఎబోలా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఆ దేశంలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటోంది. ఎబోలా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లో పూర్తిగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని. ఈ రెండు జిల్లాలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో జనాల కదలికను నిషేధిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.

సెప్టెంబర్ 20న మొదటిసారిగా ఎబోలా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఆ దేశంలో 19 మరణాలు నమోదు కాగా..58 కేసులు ధృవీకరించబడ్డాయి. ముబెండే, కస్సాండా జిల్లాల్లో వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ రెండు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు. 15 లక్షల జనాభా ఉన్న రాజధాని కంపాలాకు ఈ రెండు జిల్లాల నుంచి ప్రజలు రాకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రయాణాలు నిషేధించడంతో పాటు మార్కెట్లు, బార్లు, చర్చిలను 21 రోజుల పాటు మూసేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Read Also: Colombia: కొలంబియాలో ఘోర ప్రమాదం.. 20 మంది దుర్మరణం

ఇప్పటికే సరుకులు తీసుకెళ్లిన ట్రక్కులు ఈ రెండు ప్రాంతాల నుంచి బయటకు రావడానికి అనుమతించారు. ఇక మీదట ఈ ప్రాంతంలోకి రవాణాను నిషేధించారు. ఎబోలా వ్యాప్తిని అరికట్టడానికి సాంప్రదాయ చికిత్స చేస్తున్నవారు చికిత్సను నిలిపివేయాలని ఆదేశించారు అధ్యక్షుడు. వైరస్ బారిన పడిన అనుమానిత వ్యక్తుల ఐసోలేషన్ లోకి వెళ్లేందుకు నిరాకరిస్తే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.

ఎబోలా వైరస్ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. జ్వరం, వాంతులు, రక్తస్రావం, విరేచనాలు లక్షణాలుగా ఉంటాయి. చివరిసారిగా 2019లో ఉగాండాలో ఎబోలా మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసులుకు సూడాన్ జాతి ఎబోలాగా పేర్కొంటున్నారు. 4.5 కోట్ల జనాభా ఉన్న ఉగాండాను ఈ వ్యాధి కలవరపెడుతోంది. మొదటిసారిగా ఎబోలా 1976లో దక్షిణ సుడాన్, కాంగోలో వ్యాప్తి చెందింది. ఎబోలా నదికి సమీపంలో ఈ వ్యాధి వ్యాపించడంతో దీనికి ఎబోలా అని పేరు పెట్టారు.