ఇరాన్ శక్తివంతమైన భూకంపంతో వణికింది. శనివారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్‌లో రిక్టర్ స్కేల్ పై 6.0తో భూకంపం సంభవించింది. హెర్మోజ్ ప్రావిన్స్ లోని బందర్ అబ్బాస్ నగరానికి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదు అయింది. ఇప్పటి వరకు అందిన సమచారం ప్రకారం ఎనిమిది మందికి గాయాలు కాగా.. ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఇరాన్ భూకంపం వల్ల సరిహద్దు దేశాలైన యూఏఈ, బహ్రైన్, ఖతార్ లలో కూడా ప్రకంపనలు సంభవించాయి. గతేడాది నవంబర్ లో 6.4, 6.3 తీవ్రతతో ఇదే హర్మోజ్ గాన్ ప్రావిన్స్ భూకంపం వచ్చింది. ఇరాన్ లో అత్యంత ఘోరమైన భూకంపం 1990లో సంభవించింది. 7.4 తీవ్రతతో భూకంపం రావడం వల్ల దాదాపుగా 40,000 మంది మరణించారు. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్స్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల భూకంపాలు వస్తుంటాయి.
ఇదిలా ఉంటే చైనాలో కూడా శనివారం భూకంపం సంభవించింది. జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ లో 6.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇప్పటికే పేదరికంతో అల్లాడుతున్న ఆఫ్ఘన్ పై ఈ భూకంపం పెను తీవ్రతను చూపింది. అంతర్జాతీయ సాయం అందించాలని తాలిబన్ ప్రభుత్వం కోరింది. భూకంపం కారణంగా ఆఫ్ఘన్ లో దాదాపు 1000 మంది మరణించడంతో పాటు 1500 మంది గాయపడ్డారు.