NTV Telugu Site icon

Donald Trump: అరెస్ట్ తర్వాత అమాంతం పెరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ…

Donald Trump 2

Donald Trump 2

Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ కేసులో డొనాల్డ్ ట్రంప్ న్యాయపరమైన విచారణ ఎదుర్కొంటున్నారు. 2016 ఎన్నికల ముందు స్టార్మీ డేనియల్ తో ఉన్న శృంగార సంబంధాన్ని దాచిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుల నేపథ్యంలో ఆయన న్యూయార్క్ మాన్ హట్టన్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. మొత్తం 34 అభియోగాలను ఎదుర్కొంటున్నారు ట్రంప్.

Read Also: Kishan Reddy: బీజేపీ పోరాటం చేసింది కాబట్టే తెలంగాణ వచ్చింది

ఇదిలా ఉంటే ట్రంప్ అరెస్ట్ తరువాత అమెరికాలో ఆయనకు విపరీతమైన పాపులారిటీ ఏర్పడింది. అమాంతం ఆయనకు ప్రజాదరణ పెరిగింది. ఇలా తనకు ఆదరణ పెరగడాన్ని ‘‘చరిత్రలో అత్యుత్తమ రోజు’’ ట్రంప్ అభివర్ణించారు. డొనాల్డ్ ట్రంప్ కు సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీలో మద్దతు కూడా పెరిగింది. తాను వామపక్ష డెమోక్రాట్ కుట్రకు బాధితుడిగా ట్రంప్ చూపించుకోవడంతో అమెరికా వ్యాప్తంగా ప్రజాదరణ సొంతం చేసుకుంటున్నారు. తనను అన్యాయమైన నేరారోపణలో ఇరికించారని ట్రంప్ ఆరోపిస్తున్నారు.

76 ఏళ్ల ట్రంప్ అమెరికా చరిత్రలోనే నేరారోపణలతో విచారణకు గురైన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచారు. ఆయనకు అమెరికా వ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం కోసం ఏకంగా 10 మిలియన్ డాలర్లు విరాళంగా వచ్చాయి. మాన్ హాటన్ డిస్ట్రిక్ కోర్టు అటార్నీ ఆల్విన్ బ్రాగ్ రాజకీయ కారణాలతోనే ఇలా చేశారని ట్రంప్ ఆరోపించారు. తాజాగా యాహూ న్యూస్ నిర్వహించిన పోల్ లో చాలా మంది రిపబ్లికన్ ఓటర్లు ఇప్పటికీ ట్రంప్ నే తన అభ్యర్థిగా చూస్తున్నారు.