NTV Telugu Site icon

Cricket: మన మహిళల క్రికెట్‌కి మంచి రోజులు.. ఈసారి వరల్డ్‌ కప్‌ ఇండియాలోనే

Cricket

Cricket

Cricket: మన దేశంలో మహిళల క్రికెట్‌కి మరింత మంచి రోజులు రానున్నాయి. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఉమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌కి ఈసారి ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2021లో జరగాల్సిన మహిళల ప్రపంచ కప్‌ టోర్నీ కరోనా కారణాంగా 2022లో జరిగింది. ఈ నేపథ్యంలో 2025 వరల్డ్‌ కప్‌ని మన దేశంలో నిర్వహిస్తారు. ఈ మేరకు బీసీసీఐ బిడ్‌ వేసింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో నిన్న మంగళవారం జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ మెగా ఈవెంట్‌ నిర్వహణ అవకాశాన్ని విజయవంతంగా చేజిక్కించుకుంది.

మన దేశంలో ఈ పోటీలు చివరిసారిగా 2013లో జరిగాయి. అంటే దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియా వేదిక కాబోతోంది. మన దేశంలో 2016లో టీ20 ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ జరిగింది. ఆ తర్వాత మహిళల క్రికెట్‌కి సంబంధించిన ఒక్క గ్లోబల్‌ టోర్నీని కూడా ఇక్కడ నిర్వహించలేదు. అదే సంవత్సరం ఇండియాలో టీ20 ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌తోపాటు మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ను కూడా ఒకేసారి నిర్వహించటంతో మహిళల పోటీలకు కాస్త ప్రాధాన్యత తగ్గింది. కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఉమెన్స్‌ క్రికెట్‌ బాగా అభివృద్ధి చెందింది. ప్రజాదరణ కూడా పొందింది.

read more: Business Headlines: బ్యాంకుల్లో మూలుగుతున్న 48,262 కోట్ల రూపాయలు ఎవరివో?

మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఐసీసీ ముందుకొచ్చింది. బీసీసీఐలో సైతం ఇదే దృక్పథం పెరిగింది. ‘ఉమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌ నిర్వహణపై ఆసక్తిగా ఉన్నాం. అందుకు తగ్గట్లే నిర్వహణ హక్కులు దక్కటం చాలా సంతోషంగా ఉంది. మహిళల క్రికెట్‌ గతంలో మాదిరిగా లేదు. ఇప్పుడు రోజురోజుకీ పాపులారిటీ పెరుగుతోంది. అందుకే ప్రపంచకప్‌ నిర్వహించాలనేది సరైన సమయంలో సరైన దిశగా తీసుకున్న నిర్ణయమని చెప్పొచ్చు. బీసీసీఐ ఐసీసీతో సమన్వయం చేసుకొని ఈ టోర్నమెంట్‌ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలి’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నట్లు ఐసీసీ పేర్కొంది.

దేశంలో ఉమెన్స్‌ క్రికెట్‌ని క్షేత్ర స్థాయి నుంచి ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపడుతున్నామని బీసీసీఐ కార్యదర్శి జైషా అన్నారు. ప్రపంచ కప్‌ పోటీల నిర్వహణతో అది నెక్‌స్ట్‌ లెవల్‌కి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌ (1975) కన్నా రెండేళ్ల ముందే (1973లోనే) ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ ప్రారంభమైనా ఇది ఇంకా వెనకబడి ఉండటం గమనార్హం. పురుషుల ప్రపంచ కప్‌ కన్నా మహిళల ప్రపంచ కప్‌ ముందే ప్రారంభమైందంటే అసలు నమ్మశక్యంగా లేదని చెప్పొచ్చు.

ఇదిలాఉండగా.. 2025లో ఇండియాలో నిర్వహించే మహిళల క్రికెట్‌ ప్రపంచ కప్‌ పోటీలో ఆతిథ్య దేశంతోపాటు 2022-25 మధ్య కాలంలో ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో టాప్‌-5లో నిలిచే దేశాలకు డైరెక్ట్‌ ఎంట్రీ లభిస్తుంది. మిగతా రెండు జట్లను ఆరు గ్లోబల్‌ క్వాలిఫయర్‌ టీమ్‌ల నుంచి ఎంపిక చేస్తారు. ఈ ఆరు జట్లలో నాలుగు జట్లను ఐడబ్ల్యూసీ ర్యాంకుల నుంచి, మిగిలిన రెండు జట్లను ఐసీసీ ఉమెన్స్‌ వన్డే టీమ్‌ ర్యాంకుల నుంచి ఎంపిక చేస్తారు.

Show comments