Site icon NTV Telugu

Pakistan: ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన తర్వాత పాకిస్తాన్‌లో ఏం జరిగింది.? లాడెన్ భార్యల్ని పాక్ ఏం చేసింది..?

Pakistan

Pakistan

Pakistan: అల్ ఖైదా అధినేత, అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను యూఎస్ బలగాలు పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌‌లో హతమార్చాయి. 2001 సెప్టెంబర్ 11 దాడులు జరిగిన దాదాపు 10 ఏళ్ల తర్వాత లాడెన్ జాడను కనిపెట్టి, 2011 మే 2న యూఎస్‌కు చెందిన నేవీ సీల్స్ దాదాపు 40 నిమిషాల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, హతం చేశాయి. సైనిక కంటోన్మెంట్ ఉండే అబోటాబాద్‌లో లాడెన్ సురక్షితంగా తలదాచుకున్న విషయం అందర్ని ఆశ్చర్యపరిచింది. మరోసారి, టెర్రరిజానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తుందని ఈ ఘటన రుజువు చేసింది. సైనిక కంటోన్మెంట్‌కు కూతవేటు దూరంలోని ఒక భవనంలో బిన్ లాడెన్ ఉండటం సంచలనంగా మారింది.

అయితే, బిన్ లాడెన్‌ను చంపిన తర్వాత, పాకిస్తాన్‌లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే విషయాన్ని అప్పటి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సహాయకుడు, ఫర్హతుల్లా బాబర్ రచించిన ‘‘ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బి టోల్డ్’’ పుస్తకంలో వివరించారు. ఆ రోజు పాకిస్తాన్ నిఘా వైఫల్యం కొట్టచ్చినట్లు కనిపించిందని, పాకిస్తాన్ నడిబొడ్డున అమెరికన్ విమానాలు ఎగురుతున్నా, బిన్ లాడెన్ తమ దేశంలో ఉన్నాడనే విషయాన్ని నిఘా వర్గాలు కనిపెట్టకపోవడం సిగ్గు చేటుగా భావించినట్లు చెప్పారు. ఈ ఉదంతాన్ని దేశానికి ‘‘జాతీయ అవమానం’’గా బాబర్ పేర్కొన్నాడు. ఈ ఘటన పాకిస్తాన్ వైఫల్యం, ఇబ్బందిని కలిగించిందని చెప్పాడు.

Read Also: Prakasam : ప్రకాశం జిల్లా జే. పుల్లలచెరువు వద్ద తృటిలో తప్పిన ప్రమాదం.. స్థానికుల్లో ఆందోళన

అమెరికా ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో పాకిస్తాన్ లోని సంకీర్ణపాలనలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ), పీఎంఎల్ క్యూ మధ్య క్యాబినెట్ పదవుల కోసం తగదా నడుస్తోందని బాబర్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే జర్దారీ ఉదయం 6.30 గంటలకు విదేశాంత మంత్రి హీనారబ్బానీ ఖర్, విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్‌తో సమావేశమయ్యారని చెప్పాడు. ఈ ఘటన దేశానికి రెండు మార్గాలను మాత్రమే మిగిల్చిందని, ‘‘సహకరించడం లేదా పూర్తి అసమర్థత’’ మరేమీ కాదని జర్దారీ అన్నట్లు బాబర్ గుర్తు చేసుకున్నారు. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించారు.

ఈ ఘటనలో ఎవరిని శిక్షించలేదు, సైనిక జనరల్స్ పై ఒక విదేశం ఇచ్చిన సలహాతో జర్దారీ చర్యలు తీసుకోలేదని పుస్తకంలో వివరించారు. ఈ ఘటన నాయకుల్లో సంకల్పం లేకపోవడాన్ని, సైన్యం దాని అహంకారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించిందని బాబార్ చెప్పాడు. ఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్, సెనెటర్ జాన్ కెర్రీలు పాకిస్తాన్ సందర్శనకు వచ్చారు. బిన్ లాడెన్ ఘటన తర్వాత, అమెరికా ఏకపక్ష దాడులు చేయవద్దని పాకిస్తాన్ హామీ కోరిందని, అయితే వాషింగ్టన్ అందుకు నిరాకరించినట్లు బుక్‌లో చెప్పాడు.

లాడెన్ మరణించిన తర్వాత అతడి భార్యలను పాకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని, అయితే, ఆశ్చర్యకరంగా ఒక సీఐఏ బృందం అబోటాబాద్ కంటోన్మెంట్‌కు నేరుగా ప్రవేశం పొంది మహిళల్ని విచారించిందని, ఇది పాకిస్తాన్ సార్వభౌమాధికారంపై తీవ్రమైన ఆందోళనల్ని రేకెత్తించిందని బాబర్ పుస్తకంలో చెప్పాడు. పాకిస్తాన్ గడ్డపై అమెరికన్ ఏజెంట్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, దేశ నాయకత్వం, సైన్యం ఒత్తిడికి లోనైనట్లు కనిపించిందని ఆయన రాశారు.

Exit mobile version