NTV Telugu Site icon

Pakistan: దైవదూషణలో చైనీయుడి అరెస్ట్.. మిత్రదేశం విషయంలో పాక్ ఏం చేస్తుందో చూడాలి..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ తో పాటు ఇతర ఇస్లామిక్ దేశాల్లో ‘‘దైవదూషణ’’కు తీవ్రమైన శిక్షలు ఉంటాయి. మరణశిక్షలు విధించిన సందర్భాలు ఎక్కువ. పాకిస్తాన్ వంటి దేశాల్లో అయితే ఎలాంటి అనుమానం ఉన్నా కూడా దైవదూషణ వంటి కేసుల్లో మతోన్మాదులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో జరిగాయి. 2021లో ఓ శ్రీలంక జాతీయుడిని దైవదూషణ పేరుతో ప్రజలే నిప్పంటించి కాల్చి చంపారు. దీని తర్వాత ఓ వ్యక్తిపై దాడి చేసేందుకు ఏకంగా పోలీస్ స్టేషన్ నే అటాక్ చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ చైనా జాతీయుడిని దైవదుషణ ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో డ్యామ్‌ ప్రాజెక్టులో ఇతడు పనిచేస్తున్నాడు. చైనా గెజౌబా గ్రూప్ కంపెనీలో ఇంజనీర్‌గా ఉన్న వ్యక్తి.. రంజాన్ ప్రార్థనల కోసం చాలా బ్రేకులు తీసుకోవడంపై కార్మికులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దైవదూషణ చేశాడనే ఆరోపణలపై అతడిపై దాడి చేసేందుకు సిబ్బంది గుమిగూడిన సమయంలో పోలీసులకు ఫోన్ చేశారు. అయితే మిత్రదేశం చైనాకు చెందిన వ్యక్తి కావడం, పాకిస్తాన్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో చైనీయులు పనిచేస్తుండటంతో ఈ సంఘటనపై పాకిస్తాన్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Read Also: Golden Temple: అమ్మాయి ముఖంపై భారత జెండా..స్వర్ణదేవాలయంలోకి అనుమతి నిరాకరణ..

ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మారుమూల కోహిస్తాన్ ప్రాంతంలోని పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. జూలై 2021 ఆత్మాహుతి బాంబు దాడిలో తొమ్మిది మంది చైనా జాతీయులు మరణించిన తర్వాత దాసు జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న చైనా జాతీయులకు భారీ భద్రతను కట్టుదిట్టం చేసింది. పాకిస్తాన్ లో ఓ విదేశీయుడిపై దైవదూషణ ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు విదేశీయులపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.

డిసెంబర్ 2021లో, సియాల్‌కోట్‌లోని ఫ్యాక్టరీ మేనేజర్‌గా పని చేస్తున్న శ్రీలంక జాతీయుడు ప్రియంత దియవదనాగే (48)ను దైవదూషణ ఆరోపణలపై కొట్టి చంపి, అతని శరీరానికి నిప్పంటించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చైనా వ్యక్తిపై దైవదూషణ ఫిర్యాదును నమోదు చేయాలా వద్దా..? అనే దానిపై నిర్ణయించడానికి సోమవారం గిరిజన కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ వివాదం పాక్, చైనాల మధ్య దౌత్యపరమైన సంఘటనగా మారే అవకాశం ఉండటంతో పాకిస్తాన్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.