NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్‌లో చైనా వ్యాపారాలు క్లోజ్.. భద్రతే ప్రధాన కారణం..

Pak China

Pak China

Pakistan: పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా నెమ్మదిగా ఆ దేశంలో తమ వ్యాపారాలను మూసేస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి, ఉగ్రవాదం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై తరుచుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, పాక్ తాలిబాన్లు దాడులకు తెగబడుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో పనిచేసే చైనీయులు భయంతో పనులు చేస్తున్నారు. చివరకు చైనా తమ పౌరులు సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించిదంటే అక్కడ భద్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కరాచీ పోలీసులు నగరంలో చైనీయులు నిర్వహించే వ్యాపారాలను తాత్కాలికంగా మూసేస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా ఇలా చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇటీవల చైనా ఇస్లామాబాద్ లోని తమ రాయబార కార్యాలయం కాన్సులర్ విభాగాన్ని తాత్కాలికంగా మూసేసింది. చైనా హెచ్చరికలు చేస్తున్నప్పటికీ చైనీయులు నివసిస్తున్న ప్రాంతాల్లో రక్షణ కల్పించడంలో పాక్ విఫలం అవుతోంది. ఇదిలా ఉంటే పాక్, చైనా నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని, రాబోయే డిఫాల్ట్ ను నివారించడానికి గడువు పొడగించాలని పరోక్షంగా బీజింగ్ పై ఒత్తిడి తీసుకువస్తోంది.

Read Also: Debit cards: తగ్గిపోతున్న డెబిట్ కార్డ్స్ వినియోగం.. అంతా యూపీఐ లావాదేవీలకే మొగ్గు..

ఇదిలా ఉంటే వ్యాపారాలు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో చైనీయులు తమ భూములను ఆక్రమిస్తున్నారనే అనుమానం పాకిస్తాన్ ప్రజల్లో పెరుగుతోంది. చైనా పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. పాక్ ఉన్న పరిస్థితుల్లో చైనీయులను రక్షించడానికి ప్రత్యేక భద్రతా విభాగానికి ఆర్థిక సాయం చేయలేకపోతోంది. ఫలితంగా చైనా వ్యాపారాలు ప్రభావితం అవుతున్నాయి. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ ఇటీవల పాక్ మంత్రి బిలావల్ భుట్టోతో సమావేశమై భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. వేర్పాటువాదం ఎక్కువగా ఉన్న సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో చైనా వ్యాపారాలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి పోలీసులు చైనా వ్యాపారాలను తాత్కాలికంగా మూసేస్తున్నారు.

గతంలో కరాచీ విశ్వవిద్యాలయంలోని కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడితో, ముగ్గురు చైనీస్ ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. జూన్ 2020లో స్టాక్ ఎక్స్ఛేంజ్ ఉన్న భవనంపై దాడి జరిగింది, పాక్షికంగా చైనా కన్సార్టియం యాజమాన్యంలో ఉంది, అలాగే 2018లో కరాచీలోని చైనీస్ కాన్సులేట్‌పై దాడి జరిగింది. జూలై 2021లో, ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని కోహిస్తాన్ ప్రాంతంలోని డ్యామ్ సమీపంలో నిర్మాణ ప్రదేశానికి ఇంజనీర్లను రవాణా చేస్తున్న బస్సుపై TTP నేతృత్వంలోని ఆత్మాహుతి బాంబు దాడి చేసింది, తొమ్మిది మంది చైనీస్ కార్మికులతో సహా 13 మంది వ్యక్తులు మరణించారు. దీనికి తోడు చైనీయులు అక్కడ దైవదూషణ కేసుల్ని ఎదుర్కొంటున్నారు.

Show comments