కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్ బయటపడటంతో అధికారులు లాక్‌డౌన్ విధించారు. దీంతో కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నారు. 90 లక్షలు ఉన్న చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్ కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు వెల్లడించారు. దీంతో స్థానికులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆంక్షలు పెట్టారు. మరోవైపు ఫ్యామిలీ సభ్యుల్లో ఒకరే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాలని సూచించారు. అది కూడా రెండు రోజులకు ఒకసారి మాత్రమే బయటకు రావాలన్నారు.
మరోవైపు చాంగ్‌చున్ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మూడు సార్లు కరోనా పరీక్షలను చేయించుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరం కాని సేవలను రద్దు చేశారు. ట్రాన్స్‌పోర్ట్ లింకులను కూడా మూసివేశారు. కాగా 2020 మార్చి తర్వాత గత కొన్ని రోజులుగా చైనాలో రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గ్వాంగ్ డాంగ్, జిలిన్, షాన్ డాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. చైనా ప్రత్యేక పరిపాలన ప్రాంతం హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అధికారులు తగు చర్యలు చేపట్టారు.