Site icon NTV Telugu

China: భారత్, అమెరికా ప్రయత్నాలకు చైనా మోకాలడ్డు.. ముంబయి పేలుళ్ల సూత్రధారికి అండ!

Sajid Mir

Sajid Mir

China: లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది సాజిద్ మీర్‌ను ‘ప్రపంచ తీవ్రవాదిగా’ గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలో భారతదేశం, అమెరికా సహకారంతో ప్రతిపాదించిన ప్రతిపాదనపై చైనా శుక్రవారం మరో సారి అడ్డుపుల్ల వేసింది. భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, 2008 ముంబై దాడులలో పాల్గొన్న సాజిద్‌ మీర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను డ్రాగన్‌ అడ్డుకుని తన ఉగ్రవాదంపై తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది. యూఎన్ భద్రతా మండలి 1267 అల్-ఖైదా ఆంక్షల కమిటీ క్రింద గ్లోబల్ టెర్రరిస్ట్‌గా మీర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని భారత్, అమెరికాలు ప్రతిపాదించాయి.

సాజిద్‌ మీర్‌ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చడంతో పాటు అతడి ఆస్తులను స్తంభింపజేయడం, అతడి ప్రయాణాలపై నిషేధం వంటి ఆంక్షలు విధించాలని అమెరికా, భారత్‌ ప్రతిపాదించాయి. దీనికి ఐరాస భద్రతా మండలిలోని ఇతర దేశాలు ఆమోదం తెలపగా.. ఒక్క చైనా మాత్రం దీన్ని అడ్డుకుంది. ఈ నేపథ్యంలో సాజిద్‌ మీర్‌ను అంతర్జతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇటీవల కాలంలో భారత్-యూఎస్ ప్రతిపాదనను చైనా నిరోధించడం ఇది మూడోసారి. అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, జైషే మహ్మద్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని కోరినప్పుడు కూడా చైనా ఇలానే అడ్డుకుంది. చీఫ్ మసూద్ అజార్‌కు బీజింగ్ రక్షణ కల్పించింది. లష్కరే తొయిబా డిప్యూటీ కమాండర్ అయిన్‌ అబ్దుల్ రెహ్మాన్ మక్కీపై ఆంక్షలు విధించాలని జూన్‌లో ప్రతిపాదించగా అప్పుడు కూడా చైనా అడ్డుకుంది. యూఎన్ భద్రతా మండలి 1267 అల్-ఖైదా ఆంక్షల కమిటీ అల్‌ఖైదా వ్యక్తులు, సమూహాలు, సంస్థలు, కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే సంస్థలపై ఆంక్షలను విధిస్తుంది.

Chinese Loan Apps: స్విఛ్.. చైనాలో. సెర్చ్.. ఇండియాలో. హైదరాబాద్ సహా 16 చోట్ల ఈడీ దాడులు

మోస్ట్‌ వాంటెడ్ టెర్రరిస్ట్ సాజిద్ మీర్.. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాలో 2001 నుంచి కీలక సభ్యుడిగా పనిచేస్తున్నారు. ముంబై ఉగ్రదాడి (నవంబర్ 26, 2008) సూత్రధారులలో సాజిద్ మీర్ ఒకడు. ఈ దాడిలో, 175 మంది మరణించారు (18 మంది పోలీసు సిబ్బంది, 122 మంది, 26 మంది విదేశీయులు, 9 మంది ఉగ్రవాదులు), 291 మంది గాయపడ్డారు. భారతదేశం, పాశ్చాత్య దేశాలతో సహా అనేక దేశాల పౌరుల మరణానికి దారితీసిన అతిపెద్ద విదేశీ ఉగ్రవాద దాడికి అతను బాధ్యత వహించాడు. అతడిపై అమెరికా 5 మిలియన్‌ డాలర్లు రివార్డు కూడా ప్రకటించింది. కాగా.. గతంలో సాజిద్‌ మీర్‌ చనిపోయినట్లు పాకిస్థాన్‌ ప్రచారం చేసింది. కానీ, పశ్చిమ దేశాలు నమ్మలేదు. అతడి మృతిపై ఆధారాలు చూపించాలంటూ డిమాండ్‌ చేశాయి. దీంతో వెనక్కి తగ్గిన పాకిస్తాన్‌.. ఈ ఏడాది జూన్‌లో అతడికి 15ఏళ్లు జైలుశిక్ష విధించింది.

Exit mobile version