తెలంగాణ ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పై కేంద్ర ఆహార, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ మండిపడ్డారు. ఢిల్లీలో నిన్న జరిగిన రాష్ట్రాల ఆహార శాఖ మంత్రుల సమావేశం, దేశంలో పౌష్టికాహార భద్రతపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు తెలంగాణ ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహా ఢిల్లీ, పశ్చిమబెంగాల్, మంత్రులు గైర్హాజరు అయ్యారు. దీంతో.. ముఖ్యమైన సదస్సుకు సంబంధిత రాష్ట్రాల మంత్రులు హాజరు కాకపోవడంపై పీయుష్ గోయల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సదస్సుకు హాజరుకాని మంత్రుల వివరాలను నోట్ చేసుకున్నానని, సంబంధిత మంత్రులకు తెలియజేయాలని , దస్సుకు హాజరైన ఆయా రాష్ట్రాల అధికారులకు పీయుష్ గోయల్ తెలిపారు. అంతేకాకుండా.. సదస్సుకు రాష్ట్రాల మంత్రులు హాజరు కాకపోవడమనేది వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాగా.. ఇకపై గైర్హాజరైన మంత్రులకు ఏదైనా సమస్య వచ్చినా లేదా తనని కలవాలనుకున్నా తనకు కూడా సమయం ఉండదని గుర్తుపెట్టుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. కేంద్రం, తెలంగాణ మధ్య ఇప్పటికే ధాన్యం సేకరణపై ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో పీయూష్ గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.