Trump – Trudeau: వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయకపోతే అమెరికాకు కెనడా 51వ రాష్ట్రం అవుతుందంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అలర్ట్ అయ్యారు. సరిహద్దు భద్రత కోసం రక్షణ వ్యయాన్ని పెంచుతూ ప్రతిపాదనలు జారీ చేశారు. మినీ బడ్జెట్‌లో భాగంగా ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఈ నిధులు పబ్లిక్ సేఫ్టీ కెనడా, కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ, ది కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ విభాగాలకు వెళ్తాయని ట్రూడో సర్కార్ వెల్లడించింది. అలాగే, ఎగుమతి అయ్యే వస్తువులను తనిఖీ చేసేందుకు కెనడా బోర్డర్ సర్వీసెస్‌లో సిబ్బంది సంఖ్యను పెంచుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకోసం కస్టమ్స్ చట్టానికి సవరణలు చేయనున్నారు.
అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత కెనడా, మెక్సికోలపై 25 శాతం పన్ను విధించనున్నట్లు వ్యాఖ్యానించారు. దీంతో వెంటనే అమెరికాకు పయనమైన ట్రూడో.. ట్రంప్‌తో సమావేశం అయ్యారు. వలసలు, డ్రగ్స్ అక్రమరవాణా అంశాలపై ఇరువురు మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో వాటిని కట్టడి చేయకపోతే.. కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాల్సి వస్తుందని ట్రూడోకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా, డొనాల్డ్ ట్రంప్ తమపై టారిఫ్‌లు విధిస్తే.. తాము ప్రతి చర్యలకు దిగుతామని జస్టిన్ ట్రూడో హెచ్చరించారు. కెనడా నుంచి వచ్చే ప్రతీ వస్తువుపై సుంకాలు విధిస్తే.. జీవన వ్యయాలు మరింత పెరిగిపోతాయని అమెరికా ప్రజలకు అర్థమవుతోంది అతడు ఓవార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.