NTV Telugu Site icon

Canada: ఖలిస్తానీ టెర్రరిస్ట్ నిజ్జర్‌కి కెనడా పార్లమెంట్ నివాళి.. 1985 “ఎయిర్ ఇండియా” ఘటనను గుర్తు చేసిన భారత్..

Nijjar

Nijjar

Canada: కెనడా మరోసారి తన భారత వ్యతిరేకితను బయటపెట్టింది. ఖలిస్తానీ ఉగ్రవాదులకు సిగ్గులేకుండా మద్దతు తెలుపుతోంది. తాజాగా ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఉగ్రసంస్థ చీఫ్, గతేడాది చంపివేయబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్‌కి పార్లమెంట్‌లో నివాళులు అర్పించింది. భారతదేశ విదుదల చేసిన 40 మంది ఉగ్రవాదుల జాబితాలో నిజ్జర్ కూడా ఉన్నాడు. నిజ్జర్ మరణించి ఏడాది గడిచిన సందర్భంగా కెనడా పార్లమెంట్ మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో కొద్దిసేపు మౌనం పాటించింది.

కెనడా చర్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. 1985 ఎయిర్ ఇండియా కనిష్క విమానంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు బాంబులు పెట్టి 329 మంది మరణానికి కారణమైన ఘటనను గుర్తు చేసింది. మరణించిన వారి సంస్మరణ సభ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు స్లాన్లీ పార్క్‌లోని సెపర్లీ ప్లే గ్రౌండ్‌లో భారత రాయబార కార్యాలయం నిర్వహించనుంది. ‘‘ఉగ్రవాదం యొక్క ముప్పును ఎదుర్కోవడంలో భారతదేశం ముందంజలో ఉంది మరియు ఈ ప్రపంచ ముప్పును ఎదుర్కోవటానికి అన్ని దేశాలతో కలిసి పని చేస్తుంది. ఎయిర్ ఇండియా కనిష్క బాంబింగ్‌లో 86 మంది పిల్లతో సహా 329 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పౌర విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద సంబంధిత వాయు విపత్తులలో ఒకటిగా ఉంది. 23 జూన్ 2024 39వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది’’ అని ఇండియన్ కాన్సులేట్ ఎక్స్ లో ట్వీట్ చేసింది.

Read Also: Visakhapatnam KGH: పుట్టిన బిడ్డ కోసం తండ్రి ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్లిన ఘటన..(వీడియో)

గత ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారా వెలుపల కెనడాలోని సర్రేలో జరిగిన కాల్పుల్లో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్) చీఫ్ నిజ్జర్ మరణించారు. ఈ కేసులో కరణ్ బ్రార్, అమన్‌దీప్ సింగ్, కమల్‌ప్రీత్ సింగ్ మరియు కరణ్‌ప్రీత్ సింగ్‌లతో సహా నలుగురు భారతీయులు నిజ్జర్‌ను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ హత్య ఇండియా – కెనడాల మధ్య తీవ్ర విబేధాలకు కారణమైంది. ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదం ఏర్పడింది. స్వయంగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ… ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. ఇవి అసంబద్ధ రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గంగా మారిందని దుయ్యబట్టింది.

కొన్నేళ్లుగా, నిజ్జర్ కార్యకలాపాలకు సంబంధించి భారతదేశం అనేకసార్లు తన ఆందోళనను తెలియజేసింది. 2018లో, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వాంటెడ్ వ్యక్తుల జాబితాను ప్రధాని జస్టిన్ ట్రూడోకు నిజ్జర్ పేరుతో ఇచ్చారు. 2022లో, పంజాబ్ పోలీసులు రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న కేసుల్లో నిజ్జార్‌ను అప్పగించాలని కోరింది. 2017 లూథియానా పేలుడుతో సహా వివిధ కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 42 మంది గాయపడ్దారు. అంతకుముందు పాటియాలోని ఓ దేవాలయం సమీపంలో బాంబు పేలుడులో నిజ్జర్ పాత్రపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు.