ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై నెలరోజులు కావస్తోంది. ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై కనిపించటం ప్రారంభమైంది. ముడి చమురు, ఇందన ధరలతో పాటు నిత్యావసరాలైన వంట నూనెలు, ప్యాక్డ్ ఐటెమ్స్, కూరగాయల ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. మున్ముందు ఈ ధరల భారంతో సామాన్యుడు మరింతగా కుదేలయ్యే ప్రమాదం ఏర్పడింది.
కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే సామాన్యుడి జీవన శైలి ఘోరంగా దెబ్బతింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయని బావిస్తున్న సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగటం ప్రపంచానికి నిజంగానే పెద్ద షాక్. ఇంకా ఈ యుద్ధం ఎటువైపు దారితీస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కొందరు ఏకంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.
రష్యా -ఉక్రెయిన్ సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. ఇది ఆయిల్ దిగుమతి దేశాలకు శాపంగా పరిణమించింది. భారీగా ముడిచమురుని దిగుమతి చేసుకునే భారత్‌కి ఈ యుద్దం పెద్ద షాక్. మూడు నెలల్లో ముడి చమురు ధర 50 శాతం పెరిగిందంటేనే దీని ప్రభావం ఎలా ఉందో అర్థమవుతుంది. ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే చమురు సంస్థలు ఇంధన ధరలు పెంపునకు శ్రీకారం చుట్టాయి. ఫలితంగా బల్క్ ధరలతో పాటు రిటైల్ ధరలు కూడా పై పైకి పోతున్నాయి.
అంతర్జాతీయ విఫణిలో బ్యారెల్ ముడి చమురు 110 డాలర్లు దాటింది. ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా దేశీయ వంట గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటింది. అలాగే వాణిజ్య సిలిండర్ ధర రెండు వేల రూపాయలు దాటింది. యుద్ధ విరమణ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించకపోవటం కూడా ఈ పెరుగుదలకు ఒక కారణం. సంక్షోభం కొనసాగటం వల్ల చమురు సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక దేశాలు ప్రత్యామ్నాయ వనరుల వైపు చూస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు ప్రారంభమైనప్పుడు త్వరలో యుద్దం ఆగుతుందనే ఆశ కనిపించింది. కానీ నెలరోజులు గడుస్తున్నా చర్చల్లో పురోగతి లేదు. వార్‌కు ఇప్పుడప్పుడే ఫుల్ స్టాప్ పడదని తెలిసిపోయింది. దాంతో గతవారం 100 డాలర్ల దిగువన ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర మళ్లీ పెరిగింది.
చమురు ఇందన ధరలు ఇలా వుంటే వంటనూనె ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. మన దేశంలో లీటర్ వంట నూనె రెండు వందల రూపాయలు దాటింది. పెట్రోల్, డిజిల్, వంటగ్యాస్ ధరల కూడా ప్రభుత్వం పెంచింది. ఈ యుద్ధం వల్ల వరుసగా మూడో ఏదాది కూడా సామాన్యుల ఆర్థిక పరిస్థితి బాగు పడే సూచనలు కనిపించడం లేదు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి ఉక్రెయిన్ సంక్షోభాన్ని కారణంగా చూపుతున్నారు. అందులో కొంత మాత్రమే నిజం. అసలు కారణం ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాల ధనకాంక్ష. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధాన్ని ప్రారంభిస్తే, అమెరికా రష్యాపై ఆంక్షలు విధిస్తుందని, అదే జరిగితే ముడిచమురు సరఫరాలో కొరత ఏర్పడుతుందన్న అంచనాల ఆధారంగా ప్రస్తుతం ధరలను పెంచుతున్నారు.
ముడి చమురు కోసం ప్రపంచం రష్యా మీదనే ఆధారపడి లేదు. పెట్రోలియం ఉత్పత్తిలో రష్యా కన్నా అమెరికా, సౌదీ అరేబియాలు ముందున్నాయి. కనుక ఈ సంక్షోభం వల్ల చమురు సమస్యలు ఏర్పడితే ఇతర దేశాలు తమ సరఫరాలను పెంచవచ్చు. కానీ ఒపెక్ దేశాలు అందుకు ఒప్పుకోవటం లేదు. రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్లకు అదనంగా ఒక్క బ్యారెల్‌ను కూడా ఉత్పత్తి చేయబోమని ప్రకటించాయి. నిజానికి బ్యారెల్ ధరను వంద డాలర్లకు చేర్చాలని ఈ దేశాలు చాలా రోజులుగా నుండో డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని చక్కగా ఉపయోగించుకున్నాయి. తాజా ధరల పెరుగుదలకు ఈ సంక్షోభమే కారణం అనుకుంటే.. రేపు సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత ఆ దేశాలు ధరలు తగ్గిస్తాయా? అలా ఎప్పటికీ జరగకపోవచ్చు.