కొవిడ్ మహమ్మారి దెబ్బకు బ్రిటన్ విలవిల్లాడుతోంది. ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్లు…ఆ దేశాన్ని హడలెత్తిస్తున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో అక్కడ లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత బ్రిటన్‌లో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. బ్రిటన్‌లో 24 గంటల వ్యవధిలో లక్షా 6వేల 122 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇందులో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 13వేలకు పైనే ఉంది. యూకేలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69వేలు దాటినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఒమిక్రాన్ కేసులు యూకేలోనే నమోదవుతుండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. మహమ్మారి ఉద్ధృతి నానాటికీ పెరుగుతుండటంతో బ్రిటన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
చిన్నారులను కరోనాబారి నుంచి రక్షించేందుకు వీలుగా…5 నుంచి 11ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీ చేసేందుకు అంగీకరించింది. ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన ఫైజర్ టీకాను తక్కువ మోతాదులో… పిల్లలకు ఇచ్చేందుకు అనుమతులు మంజూరు చేసింది. 5-11ఏళ్ల వారికి ఎనిమిది వారాల వ్యవధితో రెండు డోసులు ఇవ్వనున్నారు. 16, 17ఏళ్ల వారికి బూస్టర్ డోసులను ఇచ్చే అంశంపైనా యూకే ప్రభుత్వం దృష్టిపెట్టింది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.