Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..

  • ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులపై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన..
  • విడిపించేందుకు బ్రిటన్ జోక్యం చేసుకోవాలి.
  • ఇమ్రాన్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితం..
  • సైన్యాన్ని వ్యతిరేకించినందుకే జైలు..
Imran Khan

Imran Khan

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌కు సరైన జైలు సదుపాయాలు లేవని, చిన్న గదిలో ఉంచారని, అతడిని విడిపించడంలో బ్రిటన్ జోక్యం చేసుకోవాలని కోరారు. డైలీమెయిల్‌‌లో రాసిన వ్యాసంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న గదిలో నిర్బంధించడంతో వ్యాయామం చేయడానికి, పుస్తకాలు చదవడానికి పరిమిత అవకాశాలే ఉన్నాయని అన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ను దీర్ఘకాలంగా ఒంటరిగా ఉంచుతున్నారని ఆయన అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంలో రాజకీయ ప్రేరణ ఉందని, పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం జోక్యాన్ని వ్యతిరేకించడం వల్లే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేసే మళ్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారనే భయం అక్కడి సైన్యంలో ఉందని జాన్సన్ తన వ్యాసంలో పేర్కొన్నారు. అవసరమైతే ఇమ్రాన్ ఖాన్‌‌ను విడుదల చేయడం లేదా గృహ నిర్బంధంలో ఉంచడం వంటివి చేయాలని పాక్‌కు సూచించారు.

ఇమ్రాన్ ఖాన్ అంటే అభిమానం ఉందని, అయితే కొన్ని అంశాల్లో ఆయనతో విభేదిస్తున్నట్లు చెప్పారు. ఇమ్రాన్ రష్యా, తాలిబాన్, అమెరికాకు సంబంధించి వైఖరులతో తాను విభేదిస్తానని అన్నారు. బ్రిటన్ దౌత్య, రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి ఇమ్రాన్‌ను బయటకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంచారు.