Site icon NTV Telugu

kabul Blast: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు

Kabul Bomb Blast

Kabul Bomb Blast

Bomb blast in Kabul: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. రాజధాని కాబూల్ లోని ప్రభుత్వ కాంప్లెక్స్ లోని మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. తాలిబాన్ నేతృత్వంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపంలోని మసీదులో బుధవారం పేలుడు సంభవించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

మూడు రోజుల క్రితం కాబూల్ లోని స్కూల్ లో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటన జరిగిన రోజు వ్యవధిలోనే బుధవారం మరో బాంబు పేలుడు సంభవించింది. స్కూల్ బాంబు దాడిలో 46 మంది విద్యార్థినులతో పాటు మొత్తం 53 మంది మరణించారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి వరసగా ఎక్కడోచోట బాంబు పేలుళ్లు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మైనారిటీలు అయిన షియా, హజారాలే టార్గెట్ గా దాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘన్ లో జరుగుతున్న ఉగ్రవాద దాడులకు ఐఎస్ ఖోరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తోంది. గతంలో మసీదుల్లో కూడా ఆత్మాహుతి దాడులు చేసి వందల మందిని పొట్టనపెట్టుకుంది.

Read Also: UP Meerut Couple: అన్నాచెల్లెలు అవుతారని.. జంటని విడదీశారు

గత ఏడాది ఆగస్టులో అమెరికా మద్దతు ఉన్న పౌర ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత నుంచి తాలిబాన్ పాలన అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి తాలిబాన్ పాలనను ఐఎస్ కేపీ ఉగ్రవాద సంస్థ వ్యతిరేకిస్తోంది. మరోవైపు మహిళల హక్కులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన తాలిబాన్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి మహిళలు ఇంటికే పరిమితం అయ్యారు. ఒకవేళ బయటకు వస్తే బురఖా ధరించి భర్త, కుటుంబ సభ్యులతో తోడుగా రావాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పటికీ ప్రపంచ దేశాలు తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. చాలా వరకు ఆఫ్ఘనిస్తాన్ విదేశాల నుంచి వచ్చే విరాళాలపైనే నెట్టుకువస్తోంది. తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే ఆర్థిక సహకారం నిలిచిపోయింది. దీంతో అక్కడ పేదరికం పెరిగింది. ప్రజలు తమ కిడ్నీలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.

Exit mobile version