NTV Telugu Site icon

Bangladesh: “జమ్మూ కాశ్మీర్ విడిపోవాలి, మమతా బెనర్జీ స్వాతంత్య్రం ప్రకటించుకోవాలి”.. బంగ్లా ఉగ్రనేత వార్నింగ్..

Bangladesh

Bangladesh

Bangladesh: ఉగ్రవాదం, ర్యాడికల్ ఇస్లామిక్ నేతలుగా పేరొందిన వారిని ఉగ్రవాదులుగా గుర్తిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం వారందరిని అరెస్ట్ చేసింది. వారి సంస్థలపై నిషేధం విధించింది. అయితే, హసీనా గద్దె దిగడంతో ప్రస్తుతం ఆ దేశం తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇదిలా ఉంటే, ఆయన అధికారం చేపట్టిన తర్వాత జైళ్లలో ఉన్న పలువురు ఉగ్రవాద నేతలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రానురాను ఆ దేశంలో మతోన్మాదం, ఉగ్రవాదం పెరుగుతోంది.

బంగ్లాదేశ్‌కి చెందిన రాడికల్ ఇస్లామిస్ట్ నేత మహ్మద్ జాసియుద్దీన్ రహ్మానీ భారత్‌ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ని భారత్ నునంచి విడదీయాలని పిలుపునిచ్చాడు. నిషేధిత తీవ్రవాద సంస్థ ‘‘అన్సరుల్లా బంగ్లా టీమ్(ఏబీటీ)’’కి ఇతను చీఫ్‌గా ఉన్నాడు. ఇతను తన భారత వ్యతిరేక ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదుల మద్దతు కోరాడు.

రెహ్మాని వరసగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇతడు చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘ నేను భారతదేశాన్ని హెచ్చరిస్తున్నా. బంగ్లాదేశ్ సిక్కిం, భూటాన్ లాంటిది కాదు. ఇది 18 కోట్ల ముస్లింల దేశం. మీరు బంగ్లాదేశ్ వైపు అడుగు వేస్తే ‘‘చికెన్ నెక్’’ మూయాలని మేము చైనాకు చెబుతాం.’’ అని వార్నింగ్ ఇచ్చాడు. చికెన్ నెక్ అనేది భారత్‌‌లోని ఇతర భాగాలను ఈశాన్య రాష్ట్రాలతో కలిపే సన్నని ఇరుకైన మార్గం. దీనినే ‘సిలిగురి’ కారిడార్‌గా పిలుస్తాం.

Read Also: Huawei unveils Mate XT: ఐఫోన్ విడుదలైన గంటల్లోనే.. “ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్”ని తీసుకువచ్చిన హువావే..

ఇదే కాకుండా ‘‘ఈశాన్య రాష్ట్రాలను’’ విడగొడతామని బెదిరించాడు. కాశ్మీర్ స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సాయం చేస్తాయని చెప్పాడు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా కామెంట్స్ చేశాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోడీ పాలన నుంచి విముక్తి చేసి స్వాతంత్య్రం ప్రకటించుకోవాలని కోరాడు. పంజాబ్‌లో ఖలిస్తాన్‌కి తాను మద్దతు ఇస్తానని ప్రకటించాడు. షేక్ హసీనాను గద్దె దించిన విధంగానే ఢిల్లీని కూడా స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. మీ దేశం కూడా విచ్ఛిన్నమయ్యే రోజు చాలా దూరంలో లేదని అవాకులు చెవాకులు పేలాడు. ఢిల్లీ పైన తౌహీద్ జెండాలు రెపరెపలాడుతాయని చెప్పాడు.

రెహ్మానిని 2013లో ఉగ్రవాద నేరాల కింద అరెస్ట్ చేశాడు. ఏబీటీ కార్యకలాపాలపై రాసినందుకు బ్లాగర్ రాజీబ్ హైదర్‌ని హత్య చేసిన నేరంలో రహ్మానీకి ఐదేళ్ల శిక్ష పడింది. ఈ ఏబీటీకి ఆల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నాయి. 2015లో దీనిని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో ఇది రాడికల్ భావాలను కలిగి ఉంది.