Site icon NTV Telugu

Bangladesh Violence: ఇస్కాన్‌ను నిషేధించాలని బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌.. హిందువుల నిరసన

Bangladesh

Bangladesh

Bangladesh Violence: బంగ్లాదేశ్‌ జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభును ఢాకా ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడి హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం నెలకొంది. ఇస్కాన్‌ను పూర్తిగా నిషేధించాలంటూ బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్కాన్‌ సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి. దేశంలోని శాంతిభద్రతల పరిస్థితిని రేపటి (గురువారం) ఉదయంలోగా నివేదించాలని అటార్నీ జనరల్‌ను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, అక్కడి పరిస్థితులు క్షీణించకుండా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం కోరింది.

Read Also: Game Changer: ‘నానా హైరానా’ సూపర్.. ఇది ‘శంకర్’ రేంజ్ సాంగ్ అంటే!

కాగా, ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ గత నెలలో బంగ్లాదేశ్ లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌ జాతీయ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద కామెంట్స్ చేయడంతో.. ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు చిన్మయ్ కృష్ణదాస్‌ అరెస్టును వ్యతిరేకిస్తూ పలు హిందూ సంఘాలు తీవ్ర ఆందోళనకు దిగాయి. అయితే, బంగ్లాదేశ్‌లో ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై తీవ్రవాద గ్రూపులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మైనార్టీలపై దాడులు చేయడం సరికావని.. హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని అక్కడి అధికారులను ఇండియన్ గవర్నమెంట్ కోరింది.

Exit mobile version