Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..

  • దీపు చంద్ర దాస్ హత్యలో ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
  • బంగ్లాదేశ్‌లో సంచలనంగా మారిన హిందూ కార్మికుడి హత్య..
  • ఏడాది కాలంగా గుర్తింపు మార్చుకుని మదర్సాల్లో నివాసం.
  • . ఢాకాలో పట్టుపడిన యాసిన్ అరాఫత్..
Dipu Chandra Das

Dipu Chandra Das

Dipu Chandra Das: గతేడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌ మతోన్మాదుల దాష్టీకానికి హిందూ వస్త్ర వ్యాపారి దీపు చంద్ర దాస్ ప్రాణాలు కోల్పోయాడు. దైవ దూషణ చేశాడనే నకిలీ అభియోగాల కారణంగా మతోన్మాదులు గుంపు దీపును దారుణంగా కొట్టి, నగ్నంగా చెట్టుకు వేలాడదీసి, కాల్చి చంపారు. బంగ్లాదేశ్ మైమెన్ సింగ్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనకు ప్రధాన సూత్రధారిగా ఉన్న మసీదు ఇమామ్ యాసిన్ అరావఫ్ (25)ని బంగ్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన తర్వాత ఏడాదిగా ఇతను పరారీలో ఉన్నాడు.

డిసెంబర్ 18న మైమెన్‌‌సింగ్ జిల్లా భలుకా ప్రాంతంలో పయనీర్ నిట్ కాంపోజిట్ ఫ్యాక్టరీలో పనిచేస్తు్న దీపు చంద్ర దాస్ దైవ దూషణ చేశాడనే ఆరోపణలు సృష్టించిన అరాఫత్, కంపెనీ గేటు ముందు ప్రజల్ని సమీకరించాడు. దీపుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే, అతడిని దారుణంగా కొట్టి చంపేశారు. ఈ గుంపుకు అరాఫత్ నేతృత్వం వహించినట్లు జిల్లా ఏఎస్పీ అబ్దుల్లా అల్ మామున్ వెల్లడించారు. పోలీసులకు చిక్కుండా అరాఫత్ ఏడాది కాలంగా తన గుర్తింపును దాచుకుని ఢాకాలోని డెమ్రా ప్రాంతంలోని వివిధ మదర్సాల్లో తలదాచుకున్నట్లు తేలింది. చివరకు కీలక సమాచారం అందడంతో డెమ్రాలోని సుఫాపఫా మదర్సాపై దాడి చేసి ఇతడిని అరెస్ట్ చేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో దీపు ఎలాంటి దైవ దూషణ చేయలేదని విచారణలో తేలింది. దీపు మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు దర్యాప్తు అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీనికి తోడు, దీపు చాలా సామాన్యుడని, అతను ఆండ్రాయిడ్ ఫోన్ కూడా వాడలేదని, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ ఖాతా కలిగి లేడని అతని కుటుంబ సభ్యులు కన్నీళ్లతో వెల్లడించారు. అంటే, ఇమామ్ ఒక గుంపును సమీకరించి అతన్ని సజీవంగా దహనం చేయడానికి దారితీసిన సోషల్ మీడియా పోస్ట్ లేదా పుకారుతో దీపుకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసులో ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్ చేశారు.