NTV Telugu Site icon

Israel-Hamas War: అంధకారంలో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి.. మరణం అంచున శిశువులు..

Israel Hamas War

Israel Hamas War

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం గాజాను అంధకారంలో పడేసింది. హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయిల్ దాడులు అక్కడి సాధారణ ప్రజానీకాన్ని కష్టాలపాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ వరసగా దాడులను తీవ్రతరం చేయడంతో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిలో సేవలు స్తంభించాయి. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రైన అల్ షిఫా మెడికల్ కాంప్లెక్స్‌పై ఇజ్రాయిల్ దాడి చేసిందని హమాస్ ఆధ్వర్యంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంధనం లేక చివరి జనరేటర్ కూడా నిలిచిపోయిందని ఓ పసికందు సహా ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అల్ షిఫా ఆస్పత్రి కింద హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్ ఉన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ఆస్పత్రిని ఇజ్రాయిల్ టార్గెట్ చేస్తోంది. హమాస్‌ని ఎదుర్కోవాలంటే ఆస్పత్రులను ఖాళీ చేయాల్సిందే అని, ఆస్పత్రులను పటిష్ట స్థానాలుగా చేసుకుని హమాస్ దాడులకు పాల్పడుతోందని ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. ఐడీఎఫ్ ఏదో సమయంలో గాజాలోని ఆస్పత్రుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: Sunil : మలయాళ నక్క తోక తొక్కిన సునీల్..

ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఈ దాడుల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇంధన అయిపోవడంతో ఆస్పత్రి కార్యకలాపాలు నిలిచిపోయాయని, ఇంక్యుబేటర్ లో ఉన్న ఒక శిశువుతో మరణించిందని, మరో 45 మంది పిల్లలు ఉన్నట్లు హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీనా హెల్త్ మినిస్ట్రీ ప్రకారం.. ఆస్పత్రిలో 39 మంది శిశువుల ప్రాణాలు రిస్కులో ఉన్నట్లు తెలిపింది. ఆక్సిజన్, మందులు అందకపోవడం, కరెంట్ లేకపోవడంతో వారు చనిపోయే అవకాశం ఉందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడిగా ఓ ప్రకటనలో తెలిపింది.

అక్టోబర్ 7న గాజాలోని హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1400 మందిని చంపేశారు. మరో 200 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్ పై భీకర దాడులు చేస్తోంది. మొదట వైమానిక దాడులకే పరిమితమైనప్పటికీ.. ప్రస్తుతం గాజాలోకి చొచ్చుకెళ్లి భూతల దాడులు చేస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయిల్ ప్రపంచంలో ఏ దేశం చెప్పినా వినే పరిస్థితిలో లేదు. హమాస్ పూర్తిగా అంతమైన తర్వాతే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయిల్ స్పష్టంగా తెలిపింది.