ఆస్ట్రేలియాలో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. ముఖ్యంగా సిడ్నీలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడ రెండో దశ లాక్‌డౌన్ విధించింది. కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్లెక్కారు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు. సిడ్నీ సహా పలు ప్రధాన నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. లాక్‌డౌన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఫ్రీడం, అన్‌మాస్క్ ది ట్రూత్ నినాదంతో ఆస్ట్రేలియాలో నిరసనలు కొనసాగుతున్నాయి. సిడ్నీ సహా అనేక నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో… తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లపై బారికేడ్లను తోసేసి, ప్లాస్టిక్ సీసాలను, ఇతర వస్తువులను పోలీసులపైకి విసిరేయడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. వందలాది మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ తప్పని సరి అంటోంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు ఫ్రాన్స్, బ్రిటన్‌లోనూ లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటూ నినదిస్తున్నారు.