NTV Telugu Site icon

Bangladesh: “బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు అదే కారణం”: మహ్మద్ యూనస్..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా రద్దుని కోరుతూ చేసిన నిరసనలు హింసాత్మకంగా మారి, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె గద్దె దిగిన తర్వాత బంగ్లా వ్యాప్తంగా హిందువులపై మతోన్మాద మూకలు దాడులకు తెగబడ్డాయి. హిందూ యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, కిడ్నాప్‌లు జరిగాయి. హిందూ దేవాలయాల ధ్వంసం జరిగింది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ విన్నర్ మహ్మద్ యూనస్‌గా పదవి చేపట్టిన తర్వాత కూడా ఈ దాడులు ఆగలేదు. చివరకు, భారత ప్రధాని నరేంద్రమోడీ, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల్ని అడ్డు్కోవాలని కోరడంతో దాడులు తగ్గాయి.

ఇదిలా ఉంటే, ఈ దాడులకు బంగ్లా చీఫ్ మహ్మద్ యూనస్ కొత్త కారణం చెప్పారు. హిందువులపై జరిగిన దాడులు మతపరమైనవి కావని, రాజకీయ పరమైనవని పేర్కొన్నారు. ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌కి హిందువులు మద్దతిచ్చారనే అభిప్రాయం ఉన్నందునే, రాజకీయంగా వారిపై దాడులు జరిగినట్లు చెప్పారు. ‘‘ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీకి కూడా చెప్పాను. ఈ దాడులు అనేక కోణాలను కలిగి ఉంది. హసీనా, అవామీలీగ్ దురాగతాల తర్వాత దేశం ఒక తిరుగుబాటుని ఎదుర్కొన్నప్పుడు, వారికి మద్దతు ఇచ్చిన వారిపై దాడులు జరిగాయి’’ అని చెప్పారు.

Read Also: Kejriwal: సుప్రీంకోర్టులో లభించని ఊరట.. బెయిల్‌పై తీర్పు రిజర్వ్

‘‘అవామీ లీగ్ కార్యకర్తల్ని కొట్టేటప్పుడు, బంగ్లాదేశ్ హిందువులు అంటే అవామీ లీగ్ మద్దతుదారులనే అభిప్రాయంతో వారిపై దాడులు జరిగాయి. జరిగినవి సరైనవని నేను అనడం లేదు కానీ..కొందరు దాన్ని సాకుగా చూపి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. కాబట్టి, అవామీ లీగ్, హిందువుల మధ్య స్పష్టమైన వ్యత్యాసం లేదు’’ అని చెప్పారు. తాను న్యూఢిల్లీలో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నానని, ప్రధాని మోడీ ప్రజాస్వామ్య, స్థిరమైన, శాంతియుత మరియు ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత మద్దతుని తెలియజేశారని చెప్పారు.

1971 లిబరేషన్ వార్ సమయంలో బంగ్లాదేశ్ జనాభాలో 22 శాతం ఉన్న హిందువులు, ఇప్పుడు 170 మిలియన్లలో 8 శాతం ఉన్నారు. ప్రధానంగా లౌకిక వైఖరి అవలంభిస్తుందని అవామీ లీగ్‌కి మద్దతు ఇస్తున్నారు. భారతదేశం-బంగ్లాదేశ్ సంబంధాల భవిష్యత్తు గురించి చర్చిస్తూ, యూనస్ భారతదేశంతో మంచి సంబంధాల కోసం కోరికను వ్యక్తం చేశాడు, అయితే షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ మరొక ఆఫ్ఘనిస్తాన్‌గా మారుతుందనే కథనాన్ని న్యూఢిల్లీ తప్పక విరమించుకోవాలని పట్టుబట్టారు.

Show comments