NTV Telugu Site icon

Hajj Pilgrims: నిప్పుల కొలిమిలా “హజ్ యాత్ర”.. 68 మంది భారతీయులతో పాటు 1000కి పైగా మృతి..

Hajj

Hajj

Hajj Pilgrims: ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ‘‘హజ్ యాత్ర’’ యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు. దారుణమైన వేడి కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు 68 మంది భారతీయులతో పాటు కనీసం 1000 మంది వరకు వేడి కారణంగా మరణించినట్లు రిపోర్టులు తెలుపుతున్నాయి. గురువారం కొత్తగా నమోదైన మరణాల్లో ఈజిప్ట్ దేశానికి చెందిన 58 మంది ఉన్నారు. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లిన వారిలో మరణించిన వారి సంఖ్య 1000ని దాటింది. ఈజిప్టు నుంచే ఎక్కువ మంది మరణించిన వారు ఉన్నారు. ఈ ఒక్క దేశం నుంచే 658 మంది మరణించారు. మరణించిన 630 మందిని గుర్తించాల్సి ఉంది.

Read Also: UGC-NET: యూజీసీ-నెట్ పునఃపరీక్షపై కేంద్ర విద్యాశాఖ కీలక సమాచారం..

ఇండియా నుంచి యాత్రకు వెళ్లిన వారిలో 68 మంది మరణించినట్లు సౌదీ దౌత్యవేత్తలు చెప్పారు. వేడి కారణంగానే మరణాలు చోటు చేసుకుంటున్నట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా, ఇరాక్ దేశాలకు చెందిన వారు ఉన్నట్లు ధృవీకరించారు. గతేడాది 200 మందికి పైగా యాత్రికులు మరణించారు. సౌదీ అరేబియాలో ఆదివారం రోజు 2700 కంటే ఎక్కువ వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ప్రతీ ఏడాది కూడా మరణాలు చోటు చేసుకుంటున్నప్పటికీ, ఈ ఏడాది మాత్రం అనూహ్యంగా మరణాల సంఖ్య 1000ని దాటింది. హజ్ యాత్రకు కేంద్రంగా ఉన్న మక్కాలో ప్రతీ దశాబ్ధం ఉష్ణోగ్రత 0.4 డిగ్రీల సెల్సియస్ పెరుగుతోంది.