Pakistan: పాకిస్తాన్‌లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీ చీప్ అసిమ్ మునీర్‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(సీడీఎఫ్)గా నియమించింది. ఇటీవల పాకిస్తాన్ రాజ్యాంగంలో 27వ రాజ్యాంగ సవరణ చేసి, అసిమ్ మునీర్‌కు సీడీఎఫ్ రూపంలో అపరిమిత అధికారాలను కట్టబెట్టింది. ఒక విధంగా చెప్పాలంటే, ప్రభుత్వానికి సమాంతర వ్యక్తిగా, ఒక విధంగా చెప్పాలంటే పౌర ప్రభుత్వం కన్నా మిన్నగా ఆయన అధికారాలు ఉంటున్నాయి. ఈ సీడీఎఫ్ పదవిలో మునీర్ 5 ఏళ్ల పాటు కొనసాగుతారు.
పాకిస్తాన్ న్యూక్లియర్ బటన్ అసిమ్ మునీర్ చేతిలో..
సీడీఎఫ్ పదవి ద్వారా ఆయన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు అధిపతిగా ఉంటారు. దేశంలో అణ్వాయుధాలు, క్షిపణి వ్యవస్థలను నిర్వహించే నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణ ఇతడి ఆధీనంలో ఉంటుంది. దీంతో, మునీర్ పాక్‌లో అత్యంత శక్తివంతమైన సైనిక వ్యక్తిగా నిలిచారు. అసిమ్ మునీర్‌కు ఆ దేశ అధ్యక్షుడితో సమానంగా చట్టపరమైన రక్షణ కల్పించింది. అధ్యక్షుడి లాగే ఫీల్డ్ మార్షల్ అయిన అసిమ్ మునీర్‌కు జీవితకాలం చట్టపరమైన విచారణ, చర్యల నుంచి రోగనిరోధక శక్తి ఉంటుంది. వైమానిక దళం, నావికా దళాధిపతులకు కూడా ఇది వర్తిస్తుంది.
సైన్యంపై పూర్తి పర్యవేక్షణ ఇకపై పాక్ ప్రభుత్వానిది కాదు. అసిమ్ మునీర్ చేతిలోనే పూర్తి సైన్యం ఉంటుంది. పాక్ మీడియా నివేదికల ప్రకారం, సీడీఎఫ్‌కు ఇప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (VCOAS) పదవి నియామకాల్ని చేపట్టే అధికారం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే పాక్‌లో ఇప్పుడు హైబ్రీడ్ పాలన ఉందని చెప్పవచ్చు. నిజంగా చెప్పాలంటే, ప్రభుత్వంపై కూడా సైన్యానిదే పై చేయి. అసిమ్ మునీర్ ఆర్మీ చీఫ్‌గా, సీడీఎఫ్‌గా ఏకకాలంలో పదవుల్ని నిర్వహిస్తారు. పాకిస్తాన్ చరిత్రలో ఐదు నక్షత్రాల ఫీల్డ్ మార్షల్ హోదా, COAS, CDF జాయింట్ కమాండ్ రెండింటినీ ఒకేసారి కలిగి ఉన్న మొదటి సైనిక అధికారి ఆయన. 1965లో భారతదేశంతో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌కు నాయకత్వం వహించిన జనరల్ అయూబ్ ఖాన్ తర్వాత ఫీల్డ్ మార్షల్ పదవిని పొందిన దేశ చరిత్రలో ఆయన రెండవ సైనిక అధికారిగా నిలిచారు.
