NTV Telugu Site icon

Infertility: ప్రతీ ఆరుగురిలో ఒకరికి సంతానలేమి.. డబ్ల్యూహెచ్ఓ నివేదికలో వెల్లడి..

Infertility

Infertility

Around 1 in 6 people worldwide experience infertility: ప్రతీ ఆరుగురిలో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) తన కొత్త నివేదికలో పేర్కొంది. మొత్తం వయోజన జనాభాలో 17.5 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు తెలిపింది. ఈ సమస్యను అధిగమించేందుకు సంతాన సాఫల్యత చర్యలను చేపట్టాలని, అవి అందరికి అందుబాటులో ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ఈ సమస్యకు ప్రాంతాలతో సంబంధం లేదని, పేద, ధనిక, మధ్య ఆదాయం ఉన్న దేశాల్లో కూడా ఈ సమస్య ఉందని వెల్లడించింది. అధిక ఆదాయ దేశాల్లో ఇది 17.8 శాతం ఉండగా.. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ఇది 16.5 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

Read Also: Harish Rao: పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్

సాధారణంగా 12 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం దంపతులు కలుసుకున్నా గర్భం దాల్చని పరిస్థితిని వంధ్యత్వంగా అభివర్ణిస్తారు. ఇంత మంది సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారని, సంతాన సాఫల్యత సౌకర్యాలను విస్తరించి, వాటిని అందుబాటు ధరల్లో ఉంచాలని, తక్కువ వ్యయం, భద్రతతో కూడిన విధానాలను తేవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అద్నాం గేబ్రియేసన్ అన్నారు.

సంతానలేమి దంపతుల మనోవేధన, సమాజంలో ఓ కళంకం, ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుందని, ప్రజల మానసిక శ్రేయస్సుపై ప్రభావం చూపిస్తుందని నివేదిక వెల్లడించింది. సంతానలేమని నివారణ, నిర్థారణకు ఐవీఎఫ్ చికిత్స విధానాన్ని అతి తక్కువ కేటాయింపులు, పరిమిత చికిత్స ఉండటం ఇబ్బందిగా మారిందని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. ఐవీఎఫ్ చికిత్స కోసం భారీగా ఖర్చు చేస్తూ కోట్ల మంది పేదరికంలోకి జారీ పోతున్నారని సంస్థ ప్రతినిధి పాస్కల్ అలాటీ పేర్కొన్నారు. అత్యుత్తమ పాలసీలు, ప్రభుత్వ నిధుల కేటాయింపు ద్వారా ప్రజలు పేదరికంలోకి జారిపోకుండా కాపాడుకోవచ్చని నివేదిక సూచించింది.