Anti-Covid protests flare up in China: కోవిడ్ లాక్ డౌన్ వ్యతిరేకంగా చైనా దేశంలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు, యువత పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ దిగిపోవాలని, చైనా కమ్యూనిస్ట్ పార్టీ దిగిపోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. చైనాలో నిరసన కార్యక్రమాలు జరగడం చాలా చాలా అరుదు. అటువంటిది అక్కడ ‘జీరో కోవిడ్’ విధానం పాటిస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వానికి, అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు.
జిన్జియాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరుమ్ కీ నగరంలో ఓ ఎత్తైన భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంతో 10 మంది మరనించడంతో పాటు పలువురు గాయపడ్డారు. భవనం పాక్షికంగా లాక్ డౌన్ చేయడం వల్లే నివాసితులు తప్పించుకోలేక మృతి చెందారని ప్రజలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ అగ్నిప్రమాదం ఘటన చైనాలో అగ్గిరాజేసింది. చైనా వాణిజ్య రాజధాని షాంఘైతో పాటు ఇతర నగరాల్లో కూడా ఆదివారం ప్రజలు కోవిడ్-19 నియంత్రణకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. షాంఘై నగరంలో శనివారం ఉరుమ్ కీ బాధితులకు కొవ్వత్తులతో సంతాపాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు చూస్తుండగానే.. సెన్సార్ షిప్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
Rare protests broke out in China's Xinjiang region opposing prolonged COVID-19 lockdowns, according to footage seen on social media https://t.co/tHXkz5lRon pic.twitter.com/0phutiecBX
— Reuters (@Reuters) November 26, 2022
‘‘ఉరమ్ కీలో లాక్డౌన్ ఎత్తండి, జిన్జియాంగ్ కోసం లాక్డౌన్ ఎత్తండి, మొత్తం చైనా కోసం లాక్డౌన్ ఎత్తండి!’’ అంటూ నినాదాలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో అన్ని దేశాలు సహజీవనం చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం ఒక్క కేసు నమోదు అయినా తీవ్రమైన లాక్డౌన్ విధిస్తోంది. దీంతో ప్రజల్లో అసంతృప్తి కట్టలుతెంచుకుంటోంది. ఇదిలా ఉంటే అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిరసనలను బలవంతంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నాయి. నిరసనకారులపైకి టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే ప్రయోగిస్తున్నాయి. చైనా సోషల్ మీడియా వీచాట్, వీబో వంటి వాటిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ తొలగిస్తోంది కమ్యూనిస్ట్ ప్రభుత్వం.
జిన్‌పింగ్ పట్ల తీవ్ర వ్యతిరేకత:
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మూడోసారి జిన్ పింగ్ అధ్యక్షుడు అయ్యేందుకు మార్గం సుగమం కావడంతో అక్కడి ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అయితే కమ్యూనిస్ట్ చైనాలో ప్రభుత్వం వ్యతిరేక నిరసనలు అనేవి చాలా అరుదు. ఒక వేళ చేసినా అక్కడి ప్రభుత్వం క్రూరంగా అణిచివేస్తుంది. 1989 తియానన్‌మెన్ స్క్వేర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే అత్యంత క్రూరంగా అణిచివేసింది. ప్రస్తుతం ప్రభుత్వం అవలంభిస్తున్న ‘జీరో కోవిడ్’ విధానంపై రాజధాని బీజింగ్, షాంఘై, లాన్ జౌ, నాన్ జింగ్ నగరాల్లో ఉరుంకీ బాధితులకు సంతాపంగా క్యాండిల్ ర్యాలీ జరిగింది.