Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి

Small Plane Crash

Small Plane Crash

Plane Crash: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రెస్నో నగరంలో శనివారం మధ్యాహ్నం ఓ చిన్న విమానం అదుపుతప్పి నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో బ్లైత్ అవెన్యూలోని సియెరా స్కై పార్క్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం ఫ్రెస్నో నగరంలోని వాయువ్య భాగంలో ఉంది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. అధికారులు ఘటనపై దర్యాప్తు స్టార్ట్ చేశారు.

రంగంలోకి దిగిన అధికారులు

విమాన ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఫ్రెస్నో పోలీస్ డిపార్ట్‌మెంట్, ఫ్రెస్నో ఫైర్ డిపార్ట్‌మెంట్, పీజీఈ, ఫ్రెస్నో కౌంటీ షెరీఫ్ కార్యాలయం, నార్త్ సెంట్రల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతానికి భారీ సంఖ్యలో వాహనాలు, అత్యవసర సిబ్బంది చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానం కూలిన ఘటనతో పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పీజీఈ అవుటేజ్ మ్యాప్‌లో కూడా ఈ అంతరాయం నమోదైంది. అయితే కొద్దిసేపటికే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

ప్రస్తుతం అధికారులు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులను విచారిస్తూ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. విమానంలో ఉన్న పైలట్, ప్రయాణికుల గుర్తింపును అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు చెబుతున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏంటి? విమానం సాంకేతిక సమస్యకు గురైందా? లేక ఇతర కారణాలతో కూలిపోయిందా? అనే కోణాల్లో అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫ్రెస్నో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రాంతంలో సాధారణ పరిస్థితులను కొనసాగించేందుకు చర్యలు చేపడుతున్నారు.