Site icon NTV Telugu

Pakistan: “అమెరికా యుద్ధాల వల్ల లాభపడుతోంది”.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Pakistan Defence Minister Khawaja Asif

Pakistan Defence Minister Khawaja Asif

Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత నుంచి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వరసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఉగ్ర ఘటన తర్వాత, పాశ్చాత్య మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా, వెస్ట్రన్ దేశాల ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌ సమయంలో భారత్ దాడి చేస్తుంటే, వింత ప్రకటనలు చేస్తూ పాకిస్తాన్ ప్రజల నుంచే ట్రోలింగ్ ఎదుర్కొన్నారు.

తాజాగా, ఆయన అమెరికా గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికా తన ఆయుధ పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశపూర్వకంగా ప్రపంచ సంఘర్షణలను పెంచుతున్నాయని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోంది. ఆయన వ్యాఖ్యలను విమర్శిస్తున్న వారు కూడా ఉన్నారు.

గత శతాబ్దంలో అనేక అంతర్జాతీయ సంఘర్షణలకు అమెరికా కేంద్రంగా ఉందని ఆసిఫ్ ఆరోపించారు. “గత 100 సంవత్సరాలలో, అమెరికన్లు యుద్ధాలను సృష్టించారు. వారు 260 యుద్ధాలు చేశారు, అయితే చైనా కేవలం మూడు యుద్ధాలలో మాత్రమే పాల్గొంది” అని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ అమెరికా డబ్బు సంపాదిస్తూనే ఉందని, వారి సైనిక పరిశ్రమ జీడీపీలో భారీగా ఉందని, అందుకే వారు సంఘర్షణల్ని సృష్టిస్తున్నారని అన్నారు.

Read Also: PM Modi: ‘‘మాట పదిలం’’.. ఎన్డీయే నాయకులకు ప్రధాని కీలక సలహా..

సిరియా, ఈజిప్ట్, ఆఫ్ఘనిస్థాన్, లిబియా ఒకప్పుడు సంపన్నంగా ఉండేవి, కానీ సుదీర్ఘ యుద్ధాల కారణంగా నాశనమయ్యాయని అన్నారు. ఇప్పుడు ఈ దేశాలు దివాళా తీశాయని,వీరి పతనంలో అమెరికా ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. అమెరికా తన ఆయుధ పరిశ్రమ లాభాల కోసం రెండు వైపుల నుంచి ఆడుతుందని ఆసిఫ్ విమర్శించారు.

అయితే, ఆసిఫ్ వ్యాఖ్యలను పలువురు సమర్థిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. కొందరు పాకిస్తాన్‌కి అమెరికా సైనిక సాయాన్ని ఎత్తచూపారు. ఒక యూజర్ ‘‘పాకిస్తాన్‌కు సహాయం అవసరమైనప్పుడు, అది అమెరికా పాదాలను పట్టుకోవడానికి పరిగెత్తింది, మరియు ఇప్పుడు కాల్పుల విరమణ జరిగిన తర్వాత, అది అమెరికాను నిందించడానికి తిరిగి వచ్చింది’’ అని అన్నారు. మరొకరు, ‘‘ఇది కొంత వరకు నిజం. అన్ని అగ్రదేశాలు ఆయుధాలఅను సరఫరా చేస్తాయి. వారు ఎల్లప్పుడూ తమ ఆయుధాలను విక్రయించడానికి ప్రపంచంలో ఉద్రిక్తతల్ని కోరుకుంటారు’’ అని చెప్పారు.

Exit mobile version