PM Modi: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో ఎన్డీయే ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేడీ నడ్డా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీయే నాయకులకు ప్రధాని నరేంద్రమోడీ కీలక సూచనల చేశారని తెలుస్తోంది. నాయకులు బహిరంగ ప్రకటనలు చేసే సమయంలో సంయమనం పాటించాలని కోరారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పార్టీ నాయకులు చేసే అనవసరమైన ప్రకటనలపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారని, విచక్షణారహిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని వారిని కోరినట్లు తెలుస్తోంది. ‘‘ఎక్కడైనా ఏదైనా మాట్లాడటం మానుకోవాలి’’ అని, క్షమశిక్షణతో కూడిన సంభాషణ అవసరమని ప్రధాని మోడీ చెప్పారు. మధ్యప్రదేశ్, హర్యానాకు చెందిన బీజేపీ నేతలు ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రధాని మోడీ నుంచి ఈ సలహా వచ్చింది. “ఆపరేషన్ సిందూర్” అంశంపై, ఏ మూడవ పక్షం ప్రమేయం లేదని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంలకు ఆయన తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో మీడియా సమావేశాలకు ప్రాతినిధ్యం వహించిన కల్నర్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ బీజేపీ నేత, ఎమ్మెల్యే విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విజయ్ షా మాట్లాడుతూ…ఆపరేషన్ సిందూర్లో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారి సమాజం నుంచే ఒక సోదరిని పంపామని చెప్పడం వివాదంగా మారింది. ఇదే విధంగా, మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పాదాలకు సాయుధ దళాలు నమస్కరించాలని చెప్పడం కూడా వివాదంగా మారింది.