NTV Telugu Site icon

Lebanon-Israel War: తక్షణమే లెబనాన్‌ను విడిచి పెట్టాలని భారతీయులకు కేంద్రం హెచ్చరిక

Lebanonisrael War

Lebanonisrael War

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. తక్షణమే లెబనాన్‌ను ఖాళీ చేయాలని భారతీయ పౌరులకు కేంద్రం సూచించింది. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుత పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉంది. అంతేకాకుండా ఇటీవల ఇరాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య తర్వాత మరింత కఠినమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేయాలనే ఇరాన్ ప్రణాళిక రచించింది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తక్షణమే భారతీయులు లెబనాన్‌ను ఖాళీ చేయాలని కేంద్రం సూచించింది. ఇక తప్పని పరిస్థితులు ఉంటే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికింది. బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని కేంద్రం సూచించింది. లెబనాన్‌లోని భారతీయ పౌరుల కోసం ఎంబసీ ఎమర్జెన్సీ నంబర్‌ ఏర్పాటు చేసింది.

ఇది కూడా చదవండి: Delhi High Court: గర్భిణీగా ఉండటం అనారోగ్యం కాదు.. ఆమెకు ఉద్యోగాన్ని తిరస్కరించలేరు..

భారత్‌తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే సహా పలు దేశాలు తమ పౌరులను లెబనాన్ విడిచి వెళ్లాలని కోరాయి. తమ పౌరులకు లెబనాన్ నుంచి త్వరగా వెళ్లిపోవాలని సూచిస్తూ సలహాలు జారీ చేశాయి.

ఇజ్రాయెల్‌లోని గోలన్‌ హైట్స్‌లో గత శనివారం హెజ్‌బొల్లా దాడితో ఫుట్‌బాల్‌ ఆడుతున్న 12 మంది చిన్నారులు, యువత మృతి చెందారు. దీంతో తీవ్ర ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ హెచ్చరించారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ ఏ క్షణమైనా దాడిచేయవచ్చని అంతర్జాతీయ మీడియా వర్గాలు సైతం పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాద సంస్థ కమాండర్‌ ఫాద్‌ షుక్ర్‌, ఆ సంస్థ స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్‌ కిపణులతో దాడిచేసింది. ఈ దాడిలో హెజ్‌బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్‌ ఫాద్‌ షుక్ర్‌ మృతి చెందాడు. షుక్ర్‌ మృతిని హెజ్‌బొల్లా ధ్రువీకరించింది.

ఇది కూడా చదవండి: Kerala Floods: కేరళ వరదలు.. సూర్య అండ్ కో భారీ విరాళం

ఆ తర్వాత కొద్ది గంటలకే ఇరాన్‌లో ఉన్న హామస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ హత్య చేసింది. హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలని ఇరాన్‌ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అక్టోబర్‌ 7 మెరుపు దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హమాస్‌ సైనిక విభాగాధిపతి మహ్మద్‌ డెయిఫ్‌ను హత్య చేసినట్లు తాజాగా ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. దీంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.