Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఆరోపణలు, లైంగిక వేధింపులు ఇలా పలు అభియోగాల్లో ఇరుక్కున్నారు మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అక్కడి న్యాయమూర్తులు ట్రంపును విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన అరెస్టు జరుగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. 2016 ఎన్నికల ముందు తనతో సెక్స్ చేసిన విషయాన్ని దాచేందుకు 1,30,000 డాలర్లను ఇచ్చినట్లు స్టార్మీ డేనియల్స్ ఆరోపిస్తోంది. మాన్ హటన్ అటార్నీ, గ్రాండ్ జ్యూరీ విచారణకు అనుమతించిన 24 గంటల్లోనే ట్రంప్ పై ఆయన అభిమానుల్లో సానుభూతి పెరిగింది.
Read Also: China: 8 ఏళ్ల బాలుడిని చూసి భయపడుతున్న చైనా.. అసలేంటి ఆ స్టోరీ..?
2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుచోవాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే అమెరికాలోని పలు ప్రాంతాల్లో తన అభిమానులు, మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక ఆయనపై విచారణకు ఆదేశించిన 24 గంటల్లోనే 4 మిలియన్ డాలర్లు (రూ.32.87 కోట్లు) ను అభిమానులు విరాళాలుగా పంపించారు. ఇందులో 25 శాతం చందాలు తొలిసారి విరాళాలు ఇస్తున్న దాతల నుంచే రావడం గమనార్హం.
అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల నుంచి విరాళాలు వచ్చాయి, న్యాయవ్యవస్థను ఆయుధంగా వాడుకోవడాన్ని అమెరికన్లు తిరస్కరిస్తున్నారని క్షేత్రస్థాయిలో వస్తున్న విరాళాలను బట్టి తెలుస్తోందని ట్రంప్ ప్రచార బృందం ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ ట్రంప్ పై కేసు వేసిన పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ కు కూడా విపరీతంగా క్రేజ్ వచ్చింది. ఆమె ఫోటోలు, సంతకాలతో ఉన్న మర్చెండైజ్ ను కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఆమె బికినీ ధరించి ఉన్న చిత్రాలు కలిగిన టీషర్టులకు విపరీతంగా ఆర్డర్లు పెడుతున్నారు. ఒక్కో టీషర్ట్ ను రూ. 1600-1700 మధ్య విక్రయిస్తున్నారు.