Afghan: పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలపై ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ తమ దేశంపై నిరంతరం జరుపుతున్న దాడులకు ఆఫ్ఘనిస్థాన్ ‘మహా ప్రతీకారం’ తీర్చుకుంది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద కేంద్రాలే లక్ష్యంగా ఆఫ్ఘన్ వైమానిక దళం (Afghan Air Force) డ్రోన్లతో విరుచుకుపడింది. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులలోని ఐసిస్ (ISIS), ఐసిస్-ఖొరాసన్ (ISIS-K) స్థావరాలపై భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ఉమ్మడి కార్యాచరణ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు ఆఫ్ఘన్ ఇస్లామిక్ ఎమిరేట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
శత్రు గూఢచార సంస్థల అండతోనే కుట్రలు..
ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ‘X’ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం.. కొన్ని శత్రు దేశాల గూఢచార బృందాల సహాయంతో, ఈ సరిహద్దు ప్రాంతాల నుంచి ఆఫ్ఘనిస్థాన్‌పై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో ఆఫ్ఘన్ గడ్డపై జరిగిన పలు ప్రాణాంతక ఘోర దాడులకు ఇవే ప్రధాన కార్యాచరణ స్థావరాలుగా పనిచేశాయని రక్షణ శాఖ నిర్ధారించింది. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నందుకే ఈ ముందస్తు దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. ఆఫ్ఘన్ వైమానిక దళం ముందుగా నిర్ణయించుకున్న వ్యూహాత్మక లక్ష్యాలపై గురితప్పకుండా దాడులు చేసింది. ఆఫ్ఘన్ దళాలు ప్రధానంగా మూడు ప్రాంతాలను టార్గెట్ చేశారు.
ఖిలా అబ్దుల్లా జిల్లా (గులిస్థాన్ ప్రాంతం): ఇక్కడున్న ఐసిస్ ముఠాల ఉమ్మడి రక్షణ వలయాలపై డ్రోన్లు బాంబుల వర్షం కురిపించాయి.
చాగై జిల్లా (షకర్ అబ్ జంగల్ గార్డి ప్రాంతం): ఉగ్రవాదులు రవాణా, ఆయుధ నిల్వల కోసం ఉపయోగించే ప్రధాన స్థావరాలపై నిప్పులు కురిపించారు.
ఒరక్జాయ్ ఏజెన్సీ (కంబర్ ఖేల్ ప్రాంతం): ఇక్కడ ఉన్న ప్రమాదకరమైన ‘ఐసిస్-ఖొరాసన్’ (ISIS-K) ప్రధాన స్థావరంపై దాడి చేసి దాని వెన్ను విరిచారు.
దీంతో పాటు, ఉగ్రవాద ముఠాల కీలక నాయకులు తరచుగా రాకపోకలు సాగించే పఖ్తుంఖ్వా ప్రాంతాన్ని కూడా ఆఫ్ఘన్ దళాలు విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నాయి.
లక్ష్యాలు వంద శాతం విజయవంతం..
తాము నిర్దేశించుకున్న అన్ని ప్రధాన ఉగ్రవాద లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆఫ్ఘన్ సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో శత్రు మూకలకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆఫ్ఘన్ పాలకులు మాట్లాడుతూ.. “మా దేశ భద్రతకు, అంతర్గత స్థిరత్వానికి ఎలాంటి ముప్పు వాటిల్లినా ఇకపై సహించే ప్రసక్తే లేదు. ఎలాంటి ముప్పునైనా ముందే గుర్తించి, నిర్వీర్యం చేసి, పూర్తిగా నిర్మూలించడానికి మాకు అందుబాటులో ఉన్న అన్ని సామర్థ్యాలను, వనరులను వినియోగిస్తాం” అని పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తాజా దాడులతో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజీకి చేరాయి.

