Rohingya refugees: మయన్మార్‌లో హింసకు గురవుతున్న రోహింగ్యాలు బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాలకు వెళ్తున్నారు. అయితే వీరి వల్ల బంగ్లాదేశ్‌లో క్రైమ్ రేట్ పెరుగుతోందని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇండోనేషియాకు వచ్చిన 250 మంది రోహింగ్యా శరణార్థులను స్థానికులు వెనక్కి తిప్పిపంపించారు. రోహింగ్యాలు ఒక చెక్క పడవలో ఇండోనేషియా దక్షిణ ప్రాంతంలోని అచే ప్రావిన్సు తీరానికి చేరుకున్నారు. అయితే కోపంతో ఉన్న స్థానికులు వారిని పడవ దిగొద్దని హెచ్చరించారు. కొంతమంది శరణార్థులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునేలోపే అలసటతో కుప్పకూలారు. అయితే శరణార్థులతో కూడిన పడవను అక్కడి స్థానికులు మళ్లీ సముద్రంలోకే పంపించారు. గురువారం అర్థరాత్రి సముద్రంలోకి పంపినట్లు స్థానికులు వెల్లడించారు.
Read Also: Harish Rao : ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్‌ఎస్సే
మూడు వారాల క్రితం బంగ్లాదేశ్ నుంచి ఈ పడవ బయలుదేరినట్లు చెబుతున్నారు. అయితే అది ఇండోనేషియాలోని అచే సముద్ర తీరంలో ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదని స్థానికులు చెబుతున్నారు. మలేషియా, ఇండోనేషియా చేరుకోవడానికి ప్రతీ ఏడాది వేల సంఖ్యలో రోహింగ్యాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో ప్రయాణిస్తున్నారు. నాసిరకం పడవల వల్ల కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. అయితే మేము రోహింగ్యాలతో విసిగిపోయామని, ఇక్కడికి వచ్చిన రోహింగ్యాల్లో కొందరు పారిపోయారని, కొందరు ఏజెంట్లు వారిని ఎత్తుకెళ్లారని, ఇది మానవ అక్రమ రవాణా అని నార్త్ అచేలోని కమ్యూనిటీ నాయకుడు సైఫుల్ అఫ్వాడీ అన్నారు.
రోహింగ్యాల హక్కుల సంస్థ అరకాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ క్రిస్ లేవా మాట్లాడుతూ.. శరణార్థులకు వసతి కల్పించడానికి స్థానిక ప్రభుత్వ వనరులు లేకపోవడం, వారిని స్మగ్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే భావనతో గ్రామస్తులు వీరిని తిరస్కరిస్తున్నారని చెప్పారు. రోహింగ్యా స్మగ్లర్లు ఇండోనేషియాను మలేషియాలోకి వెళ్లేందుకు ఉపయోగించుకుంటున్నారని, ఏ ఇతర దేశం కూడా వారిని లోనికి అనుమతించడం లేదని తెలిపారు. ప్రస్తుతం పడవను తిప్పిపంపిన తర్వాత ఎక్కడికి వెళ్లిందో తెలియదని లేవా చెప్పారు.