Pok Protests: పాకిస్తాన్ ఆర్మీ, భద్రతా బలగాలు అరాచకానికి పాల్పడుతున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జరుగుతున్న నిరసనల్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడి ఆర్మీకి వ్యతిరేకంగా పీఓకేలోని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఆందోళనలను పాక్ ప్రభుత్వం అణిచివేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ భద్రతా బలగాలు సాధారణ నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. బుధవారం జరిగిన ఈ కాల్పుల్లో 08 మంది నిరసనకారులు మరణించారు. చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది.
బుధవారం బాగ్ జిల్లాలోని ధిర్ కోట్ లో నలుగురు మరణించారని, ముజఫరాబాద్ లో ఇద్దరు, మీర్‌పూర్‌లో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి నిరసనల్ని కవర్ చేసేందుకు మీడియాను అనుమతించడం లేదు. మంగళవారం ముజఫరాబాద్‌లో ఇద్దరు మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. తమ ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నారని చెబుతూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో గత 72 గంటలుగా పీఓకే వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు.
బుధవారం ఉదయం నిరసనకారులు రాళ్లు విసిరారు. ముజఫరాబాద్‌పై నిరసనకారులు మార్చ్‌ను నిరోధించేందుకు వంతెనపై కంటైనర్లను అడ్డుగా ఉంచారు. అయితే, వాటిని వంతెనపై నుంచి నదిలో పారేశారు. ముజఫరాబాద్ మరణాలకు పాక్ రేంజర్ల కాల్పులే కారణమని జేఎసీ ఆరోపించింది. ముజఫరాబాద్ కాల్పులకు సంబంధించి, పాకిస్తాన్ ఇంటెల్ ఏజెన్సీ, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతు ఇచ్చిన ముస్లిం కాన్ఫరెన్స్‌ను ఉగ్రవాద సంస్థగా ముద్ర వేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని వారు కోరుతున్నారు.
అల్లర్లు తీవ్రమవుతున్న నేపథ్యంలో పీఓకేలో పాక్ బలగాలు గస్తీని పెంచాయి. పంబాబ్ ప్రావిన్సు నుంచి అదనపు బలగాలను అక్కడికి పంపారు. రాజధాని ఇస్లామాబాద్ నుంచి అదనంగా 1000 మంది సైనికుల్ని పంపారు. పాక్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా పరిమితం చేసింది.
