లాటిన్ అమెరికా దేశం కొలంబియాలో దారుణం చోటు చేసుకుంది. జైలు నుంచి ఖైదీలు తప్పించుకునే క్రమంలో ఏర్పడిన నిరసనల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఏకంగా 51 మంది ఖైదీలు దుర్మరణం పాలయ్యారు. 24 మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ కొలంబియాలోని టోలువాలోని ఒక జైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.
కొలంబియా న్యాయమంత్రి విల్సన్ రూయిజ్ చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ఖైదీల మధ్య గొడవ జరిగిందని.. ఘర్షణ జరుగుతున్న సమయంలో ఒక ఖైదీ పరుపును తగలబెట్టడంతో మంటలు వేగంగా వ్యాపించాయని అన్నారు. మంటలు ఆర్పేందుకు జైలు సిబ్బంది ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. అగ్నిమాపక సిబ్బంది కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని.. ఈ లోపే మంటలు విస్తరించాయని మంత్రి రూయిజ్ వెల్లడించారు.
దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, వెనుజులా, కొలంబియా వంటి దేశాల్లో జైళ్లు బాగా రద్దీగా ఉంటాయి. చాలా వరకు జైళ్ల సగటు సామర్థ్యం కన్నా 20 శాతం ఖైదీలు అధికంగా ఉంటారు. తాజాగా టోటువాలో జైలులో కూడా 17 శాతం అధికంగా ఖైదీలు ఉన్నారు. కొలంబియా దేశ చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి. గతంలో కూడా లాటిన్ అమెరికా ఖండంలోని పలు దేశాల్లో ఇలాగే జైళ్లలో అల్లర్లు, ప్రమాదాలు, గ్యాంగ్ వార్లతో చాలా మంది మరణించారు. మార్చి, 2020లో బోగోటాలోని పికోటా జైల్ లో అల్లర్ల కారణంగా 24 మంది మరణించారు. జైలులో కరోనా చర్యలను వ్యతిరేకిస్తూ మొదలైన అల్లర్ల కారణంగా ఈ మరణాలు సంభవించాయి. 2019లో బ్రెజిల్ లోని ఓ జైలులో 50 మందికి పైగా చంపబడ్డారు. 2018లో వెనుజులాలో ఒక జైలులో అగ్ని ప్రమాదం వల్ల అనేక మంది మరణించారు.
