భారత్‌లోని కేరళ రాష్ట్రంలో గురువారం మొదటి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మంకీపాక్స్ గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం ఇది మంకీపాక్స్ వైరస్ వల్ల కలిగే వైరల్ జూనోటిక్ ఇన్ఫెక్షన్. ఇది జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధి. ఇది వ్యక్తి నుండి వ్యక్తికి కూడా వ్యాప్తి చెందుతుంది.
జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, తక్కువ శక్తి, శోషరస గ్రంథుల వాపు మంకీపాక్స్ వ్యాధి యొక్క అత్యంత సాధారణ లక్షణాలు.
ఈ వ్యాధి వల్ల ఇది రెండు నుండి మూడు వారాల పాటు శరీరం అంతటా దద్దుర్లు లేదా బొబ్బలు వస్తాయి.. దద్దుర్లు ముఖం, అరచేతులు, పాదాల అరికాళ్ళు, కళ్ళు, నోరు, గొంతు, గజ్జలు, శరీరంలోని జననేంద్రియ, ఆసన ప్రాంతాలలో కనిపిస్తాయి. దద్దుర్ల సంఖ్య ఒకటి నుంచి వేల సంఖ్యలో కూడా ఉంటుంది.
వ్యాధి వ్యక్తి నుండి వ్యక్తికి, జంతువు నుండి వ్యక్తికి కూడా వ్యాపిస్తుంది. కోతులు కాకుండా, ఎలుకలు, ఉడుతల నుంచి కూడా ఈ వ్యాధి వస్తుంది. మంకీపాక్స్ వ్యాధి సోకిన జంతువు రక్తం దాని శరీర చెమట లేదా దాని గాయాలతో ప్రత్యక్ష సంబంధం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. మంకీపాక్స్ నయం కావడానికి రెండు నుంచి నాలుగు వారాలు పట్టవచ్చు. గాయం గట్టిపడటం వల్ల నొప్పిగా ఉంటుంది.వైరస్ సోకిన వ్యక్తులపై పరిశోధన ఇంకా కొనసాగుతోంది. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం, మంకీపాక్స్ దద్దుర్లు ఉన్న వారితో సన్నిహితంగా ఉండటం ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వారితో లైంగిక సంబంధం ఉన్నా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తు్ంది.
మంకీపాక్స్ ఉన్న వారితో నివసించే లేదా సన్నిహిత సంబంధాలు (లైంగిక సంపర్కంతో సహా) కలిగి ఉన్న వ్యక్తులు లేదా వ్యాధి సోకిన జంతువులతో క్రమం తప్పకుండా సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తులు చాలా ప్రమాదంలో ఉన్నారు.
మంకీపాక్స్‌ను అనుమానించిన లేదా ధృవీకరించబడిన వ్యక్తులతో లేదా సోకిన జంతువులతో సన్నిహిత సంబంధాన్ని పరిమితం చేయడం ద్వారా మంకీపాక్స్‌ను వ్యాప్తిచెందే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కలుషితమైన పరిసరాలను శుభ్రపరచడం, క్రిమిసంహారకం చేయడం అవసరం. మంకీపాక్స్ ఉందని భావిస్తే వైద్య సలహాను తీసుకోండి. అనుమానం ఉంటే వైద్యులు పరీక్షించి వ్యాధి లేదని చెప్పేంతవరకు మిగతావారికి దూరంగా ఉండండి.
MonkeyPox: మంకీపాక్స్ పై కేంద్రం అలర్ట్.. మార్గదర్శకాలు జారీ
ఈ వైరస్ ప్రధానంగాపశ్చిమ ఆఫ్రికాలోని ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాలలో కనిపిస్తుందని, అప్పుడప్పుడు ఇతర ప్రాంతాలకు పాకుతుందని నిపుణులు చెబుతున్నారు. పారాస్ హాస్పిటల్‌కు చెందిన ఓ ఆరోగ్య నిపుణుడు ఈ ఇన్‌ఫెక్షన్ మశూచి లాంటిదని వివరించారు. “మంకీపాక్స్ వైరస్ ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మశూచి వంటి ఇన్ఫెక్షన్ రకం. ఈ ఇన్ఫెక్షన్ ఆఫ్రికా దేశాలలో కనిపిస్తుంది. అక్కడి జంతువులకు ఈ ఇన్ఫెక్షన్ సోకితే, ఆ తర్వాత ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తుంది.ఈ వైరస్ సోకిన చనిపోయిన జంతువుతో సంబంధంలోకి రావడం ద్వారా ఈ వైరస్ మనుషులకు కూడా వ్యాపిస్తుంది” అని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు.
మూడు రోజుల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుండి కేరళకు వచ్చిన ఒక ప్రయాణికుడి నుండి నమూనాలు సేకరించి పరీక్షించగా.. పాజిటివ్‌గా తేలింది. జులై 14న భారతదేశంలో మొట్టమొదటి మంకీపాక్స్ కేసు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.