Turkey Earthquake: భూకంపంలో టర్కీ విలవిల్లాడుతోంది. భారీ భూకంపం వల్ల గత కొన్ని దశాబ్ధాల కాలంలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని చూస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలు టర్కీని కోలుకోలేని దెబ్బతీశాయి. భూకంపం ధాటికి టర్కీ భూభాగం 5-6 మీటర్లు పక్కకు కదిలిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారంటే, భూకంప ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టర్కీతో పాటు సిరియాను భూకంపం తీవ్రంగా నష్టపరిచింది. రెండు దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 28 వేల మందికి పైగా ప్రజలు మరణించారు.
Read Also: Turkey Earthquake: టర్కీ భూకంపంలో భారతీయుడి మృతి.. “ఓం” అనే పచ్చబొట్టుతో గుర్తింపు
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కన్నీరు కారుస్తున్న ప్రజలే కనిపిస్తున్నారు. భూకంపం ధాటికి తమవారిని కోల్పోయిన వారిలో ఆవేదన కట్టలుతెంచుకుంటోంది. బతికి బయటపడ్డవారు శిథిలాల కింద తమ వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ వైపు తీవ్ర విషాదం నెలకొని ఉంటే మరోవైపు దీన్ని ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. దోపిడీలకు పాల్పడుతున్నారు. దక్షిణ ప్రాంతమైన హటే ప్రావిన్స్ లో దోపిడికి పా్లపడినందుకు 42 మందిని, గాజియాంటెప్ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురిని మొత్తంగా 48 మందిని టర్కీ అధికారులు అరెస్ట్ చేశారు.
భూకంపం కారణంగా ఆగ్నేయ టర్కీలోని 10 ప్రావిన్సుల్లో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మూడు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇందులో భాగంగా దోపిడీలకు పాల్పడుతున్న వారిని అదనంగా మూడు రోజుల పాటు నిర్భంధించవచ్చని అధికార ప్రకటనలో వెల్లడించారు. అంతకుముందు ప్రాసిక్యూటర్ల నాలుగు రోజలు నిర్భంధించే అవకాశం మాత్రమే ఉండేది. టర్కీ దోపిడీదారులపై కఠినంగా వ్యవహరిస్తుందని ఎర్డోగాన్ వార్నింగ్ ఇచ్చారు. దోపిడీలు, కిడ్నాప్ లకు పాల్పడుతున్న వ్యక్తులు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.