మెక్సికోలోని జాలిస్కో రాష్ట్రం ఎల్‌స్టా పట్టణంలో గురువారం పోలీసులు, సాయుధుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందినట్లు రాష్ట్ర గవర్నర్ ఎన్రిక్ అల్ఫారో వెల్లడించారు. మరణించిన వారిలో నలుగురు పోలీసు అధికారులు ఉన్నారని అల్ఫారో ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిందితులు ఆయుధాలు దాచిన సేఫ్‌హౌస్ గురించి తెలిపిన ఆయన.. ఎల్‌స్టాలో పోలీసులు గురువారం ఎనిమిది మంది నేరస్థులను కాల్చి చంపారని.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. దురదృష్టవశాత్తు పట్టణానికి చెందిన 4గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
జాలిస్కో రాష్ట్రంలో నేర కార్యకలాపాలపై నిఘాను పటిష్టం చేసేందుకు మెక్సికో జాయింట్ టాస్క్ ఫోర్స్ కార్యక్రమంలో భాగంగా మార్చిలో జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ సైనికుల బృందాన్ని మోహరించింది. జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అనే మెక్సికన్ క్రిమినల్ గ్రూప్ 2010లో ఉద్భవించింది. ఇప్పుడు కనీసం ఏడు మెక్సికన్ రాష్ట్రాలు, అలాగే మెక్సికో సిటీలో కూడా ఈ గ్రూప్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు, సైనికులు చర్యలు చేపట్టారు.