Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి అక్కడ మైనారిటీలు, వారి వ్యాపారాలు, ఆలయాలు, చర్చ్‌ల మీద దాడులు జరగుతూనే ఉన్నాయి. 15 రోజుల్లో దేశంలోని 49 జిల్లాల్లో 1000కి పైగా దాడులు జరిగాయి. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు మైనారిటీలపై మొత్తం 1068 దాడులు జరిగాయిని ఆ దేశంలోని ప్రముఖ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్ని వీలైనంత త్వరగా ఆపేయాలని భారత్, బంగ్లాదేశ్‌ని కోరింది.
Read Also: Israel: ఇజ్రాయిల్‌పై విరుచుకుపడిన హిజ్బుల్లా.. రాకెట్లతో దాడి..
బంగ్లాదేశ్‌లో హిందువులు ఎక్కువగా దాడులకు గురయ్యానని నివేదికలు చెప్పాయి. 9 జిల్లాలు మరియు సబ్ డివిజన్లలో వారి ఇళ్ళు, వ్యాపారాలు మరియు ప్రార్థనా స్థలాలపై దాడులు జరిగాయి. నైరుతి డివిజన్‌లోని బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లాల్లో చాలా దాడులు జరిగాయని వార్తాపత్రిక నివేదించింది.క్రైస్తవ మరియు అహ్మదీయ ముస్లిం సమాజంపై, ఇతర మైనారిటీలపై దాడులకు గురయ్యారు. ఠాకూర్‌గావ్‌లోని నిజపరా మిషన్‌లో మేరీ మాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు మరియు అనేక మిషనరీ పాఠశాలలు మరియు కళాశాలలపై బెదిరింపులు మరియు దాడికి ప్రయత్నించారు.
ఇదిలా ఉంటే, షేక్ హసీనా ఈ దాడులకు బాధ్యత వహిస్తారని కొత్తగా ఏర్పడిన బంగ్లా ప్రభుత్వం చెబుతోంది. ఆమె అధికారంలో ఉన్న సమయంలో మైనారిటీలు, హిందువులు ఆమె పార్టీ అవామీలీగ్‌కి మద్దుతుగా ఉండటంతోనే వారిపై దాడులు జరిగాయని, ఈ దాడులను మతకోణంలో కాకుండా, రాజకీయ కోణంలో చూడాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ స్వయంగా అన్నారు. ఇదిలా ఉంటే ఈ దాడులపై పరిశోధన ప్రారంభించామని, మైనారిటీలపై విశ్వాసం కల్పించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నామని బంగ్లా ప్రభుత్వం చెబుతోంది.