Nvidia Windfall: స్టాక్ మార్కెట్లో అదృష్టం అందరినీ వరించదు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. పడిపోతున్న షేర్లు కూడా ఆయన విషయంలో ఒక్కసారిగా జాక్‌పాట్‌లా మారిపోతున్నాయి. టెక్ దిగ్గజం ఎన్విడియా (#Nvidia) సీఈఓగా జెన్సన్ హువాంగ్ మళ్లీ బాధ్యతలు చేపడుతున్నారనే ఒక్క వార్త, ట్రంప్ ఖాతాలో భారీ కాసుల వర్షం కురిపించింది. సోమవారం ఎన్విడియా షేర్లు 30 శాతానికి పైగా ఎగబాకడంతో, ఆ కంపెనీలో ట్రంప్ కలిగి ఉన్న వాటా విలువ ఏకంగా 15 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 1.4 బిలియన్లు) పెరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
కొన్ని వ్యక్తిగత వివాదాలు, ముఖ్యంగా ఓ చైనీస్ గూఢచారితో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో జెన్సన్ హువాంగ్ 11 రోజుల క్రితమే ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కుదేలవుతూ వచ్చిన కంపెనీ షేర్లు, ఆయన రీ-ఎంట్రీ ప్రకటనతో ఒక్కసారిగా జూలు విదిల్చాయి. అయితే, ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన పరిణామం కాదు. హువాంగ్ను వెనక్కి తీసుకురావడంలో తానే కీలక పాత్ర పోషించానని ట్రంప్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తాను హువాంగ్‌తో మాట్లాడి ఒప్పించానని, తాము కోరుకున్నదే బోర్డు చేసిందని ట్రంప్ స్పష్టం చేశారు.
మరోవైపు, హువాంగ్ను తిరిగి సీఈఓగా నియమించాలని వాదిస్తూ ట్రంప్ నేరుగా ఎన్విడియా బోర్డు సమావేశానికి ఫోన్ చేసినట్లు ‘సెమాఫోర్’ వార్తా సంస్థ పేర్కొంది. అమెరికా ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాల సలహా మేరకు, హువాంగ్ రాకతో జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్విడియా బోర్డు ప్రకటించింది. దేశ ఆర్థిక శ్రేయస్సు కోసం ఎన్విడియాకు జెన్సన్ నాయకత్వం ఎంతో అవసరమని ట్రంప్ సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నవంబర్ 5న ప్రభుత్వ నైతిక వ్యవహారాల కార్యాలయానికి (ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్) ట్రంప్ సమర్పించిన ఆర్థిక వివరాలను కొన్ని పత్రికలు విశ్లేషించాయి. ఈ పత్రాల్లో కచ్చితమైన సంఖ్య కాకుండా షేర్ల అంచనా పరిధిని మాత్రమే పేర్కొన్నారు.
సెప్టెంబర్ 30 నాటికి ట్రంప్ వద్ద గరిష్టంగా 3,70,000 ఎన్విడియా షేర్లు ఉండి ఉండవచ్చని, సోమవారం నాటి ర్యాలీతో వాటిపై ఆయనకు 15 మిలియన్ డాలర్ల (సుమారు 1.4 బిలియన్ రూపాయలు) లాభం దక్కిందని ఎఫ్టీ లెక్కగట్టింది. ఒకవేళ అంతకుముందు షేర్లు పతనమైన సమయంలో గరిష్ట షేర్లు ఉండి ఉంటే ఆయనకు 42 మిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లి ఉండేది. ఒకవేళ కనిష్ఠ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే, ట్రంప్ వద్ద కనీసం 32,000 షేర్లు (విలువ 5.3 మిలియన్ డాలర్లు) ఉండి ఉండవచ్చని, తాజా పెరుగుదల వల్ల ఆయనకు 1.3 మిలియన్ డాలర్ల లాభం దక్కి ఉంటుందని పేర్కొంది. ప్రధానంగా S&P 500 ఇండెక్స్‌లోని పెద్ద కంపెనీల షేర్లు ఉన్న ట్రంప్ పోర్ట్‌ఫోలియోలో సెప్టెంబర్ చివరి వరకు జరిగిన లావాదేవీలే ఇందులో ఉన్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల కొనుగోళ్లు, అమ్మకాల వివరాలు ఇంకా బయటకు రాలేదు.
ట్రంప్‌కు దక్కిన ఈ భారీ లాభం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఎన్విడియా బోర్డు సొంత డైరెక్టర్ల ఆలోచనల ప్రకారం కాకుండా, వైట్ హౌస్ ఆదేశాలకు తలొగ్గి పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని కొలంబియా లా స్కూల్ ప్రొఫెసర్, కార్పొరేట్ గవర్నెన్స్ నిపుణుడు జాన్ కాఫీ ‘బ్లూమ్‌బర్గ్’తో వ్యాఖ్యానించారు. ఇక అరిజోనాకు చెందిన డెమోక్రటిక్ సెనేటర్ రూబెన్ గల్లెగో ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హువాంగ్ రీ-ఎంట్రీ ప్రకటనకు ముందు ఎవరెవరు ఏయే స్టాక్స్ కొన్నారు, ఏవి అమ్మారు అనే దానిపై తక్షణమే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిమయమైన వైట్ హౌస్ ఇదేనంటూ గల్లెగో సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.

