దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ అత్యవసర పరిస్థితిని స్వతంత్ర భారతదేశ చరిత్రలో చీకటి దినంగా అభివర్ణిస్తారు. అత్యవసర పరిస్థితి సమయంలో, భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా హరించారు. దీనికి నిరసనగా ప్రతిపక్షాలు, ఆందోళనకారులు స్టెరిలైజేషన్ నుంచి జైలు శిక్ష వరకు పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఆనాడు ఎదురైనా పరిస్థితులు, ఇబ్బందులపై ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోడీ తాజాగా పేర్కొన్నారు. బీజేపీ జూన్ 25న ‘సంవిధాన్ హత్య దివస్'(రాజ్యాంగ హత్యా దినోత్సవం)గా జరుపుకుంటోంది. త్యాగరాజ స్టేడియంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తారు.
అసలు ఎమర్జెన్సీ ఎప్పుడు.. ఎందుకు విధించారు?
దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. ప్రజాస్వామ్యంపై జరిగిన హేయమైన దాడి. ఉక్కు మహిళగా పేరొందిన దివంగత ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పిదం. కాంగ్రెస్ పార్టీని నేటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకం. తన అధికారాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. జూన్ 25, 1975 నుంచి మార్చి 21, 1977 వరకు దాదాపు 21 నెలల పాటు నియంతృత్వ పాలనలో ప్రజలు అల్లాడిపోయారు. లక్షలాది మంది జైలు పాలయ్యారు. చిత్రవధ అనుభవించారు. ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించడానికి దారి తీసిన పరిణామాలను పరిశీలిద్దాం..
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ఇందిరా గాంధీ..
1971లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 352 సీట్లు కైవసం చేసుకుంది. అప్పటికే బ్యాంకులను జాతీయం చేయడం, లౌకికవాదిగా.. పేదల పెన్నిధిగా ప్రజాభిమానం చూరగొని.. ప్రియతమ ప్రధానిగా పేరొందిన ఇందిరా గాంధీ.. భారీ మెజారిటీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ ఏర్పాటు (పాకిస్థాన్‌తో యుద్ధం)లో ప్రధాన పాత్ర పోషించి తిరుగులేని నేతగా ఎదిగారు. ఈ క్రమంలోనే ఇందిరకు ఉన్న గూంగీ గుడియా(మూగ బొమ్మ) అనే ఇమేజ్ తొలగిపోయింది. నాలుగేళ్లక కథంతా మారిపోయింది. దేశంలో కరువు, కాటకాలు విలయతాండవం చేశాయి. నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది. ఈ పరిస్థితితో దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో 1971 ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఎన్నికల బరిలో దిగిన ఇందిరకు పోటీగా.. యునైటెడ్ సోషలిస్టు పార్టీ తమ అభ్యర్థిగా రాజ్‌నారాయణ్‌ను నిలబెట్టింది. అయితే ఈ ఎన్నికల సమయంలో ఇందిర తన పదవి, పలుకుబడి ఉపయోగించి అక్రమాలకు పాల్పడి, ఓటర్లకు లంచాలు ఇచ్చి విజయం సాధించారని ఆరోపిస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇందిరా గాంధీపై ఏడు అభియోగాలు..
ఇందిరకు వ్యతిరేకంగా మొత్తం ఏడు అభియోగాలు మోపారు. ఇందిరాగాంధీ ఎన్నికల ప్రతినిధిగా ప్రభుత్వ అధికారి యశ్‌పాల్ కపూర్‌ను నియమించుకున్నారు అనేది ఆయన మొదటి ఆరోపణ. ఎన్నికల ప్రచార సభల స్టేజీల నిర్మాణం, లౌడ్ స్పీకర్ల ఏర్పాటుకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులను ఉపయోగించారనేది ఇంకో అభియోగం. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు అనేది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధన అని అలహాబాద్ హైకోర్టులో రాజ్‌నారాయణ్ వాదించారు. ఓట్ల కోసం ఇందిర డబ్బులు పంచారని, బోగస్ ఓటింగ్ చేయించారనే ఆరోపణలు కూడా ఆయన చేశారు. ఈ క్రమంలో 1975, జూన్ 12న తీర్పు వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్‌మోహన్ లాల్ సిన్హా.. ఎన్నికల్లో ఇందిర ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇందిర ఎన్నికను రద్దు చేయడమే గాక.. మరో ఆరేళ్లపాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేయవద్దని తీర్పునిచ్చారు. దీంతో ప్రధాని పదవి నుంచి ఇందిర దిగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు 1 సఫ్దార్‌జంగ్ రోడ్‌లోని ప్రధాని అధికార నివాసంలో ఇందిర అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తనకు విశ్వాసపాత్రులైన నాయకులు, సన్నిహితులను సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. 1975 జూన్ 22న దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. 1975 జూన్ 24న కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఇంజంక్షన్ ఆర్డర్లు జారీ చేసింది. ప్రధానిగా ఇందిరా గాంధీ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు, ప్రసంగాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే పార్లమెంట్‌లో ఎంపీగా విధులు నిర్వర్తించకుండా, ఓటింగ్‌లో పాల్గొనకుండా న్యాయస్థానం ఆంక్షలు విధించింది. తాము తుది తీర్పును వెలువరించే వరకు ఈ ఆంక్షల అమలు కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తుది తీర్పు వచ్చేంత వరకు ఎంపీగా మాత్రం ఆమె ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇందిర వ్యతిరేక, అనుకూల నిరసనలు రాజుకున్నాయి.
నాటి రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీకి ఇందిరా గాంధీ లేఖ..
ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి స్వరణ్‌సింగ్‌ను తాత్కాలిక ప్రధానిగా చేయాలనే ఇందిరా గాంధీ ఆలోచించినట్లు పలు పుస్తకాల్లో పేర్కొన్నారు. నాటి సీనియర్ కేంద్ర మంత్రి జగ్జీవన్‌రామ్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారని చెబుతారు. స్వరణ్‌సింగ్‌ను ప్రధానిగా చేయడాన్ని జగ్జీవన్‌రామ్ అంగీకరించలేదు.. తాను కూడా ప్రధాని రేసులో ఉన్నానని తెలిపినట్లు కొన్ని పుస్తకాల్లో పేర్కొన్నారు. ఇదే అదునుగా చూసిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు జరిపాయి. 1975 జూన్ 25న మధ్యాహ్నం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇందిరకు వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. దీంతో ఇందిరా గాంధీ అప్రమత్తమైంది. తన పదవి, ప్రభుత్వాన్ని కాపాడేందుకు సిద్ధమైంది. ఇందిరా గాంధీ నాటి రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్‌కు పంపారు. దేశానికి పెను ముప్పు పొంచి ఉందని.. అంతర్గత భద్రతకూ ముప్పు కలిగే అవకాశం ఉందని.. అందుకే ఎమర్జెన్సీని ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని ఆ లెటర్‌లో పేర్కొన్నారు.
1975 జూన్ 25 అర్ధరాత్రి 11.45 నిమిషాలకు..
ఈ పరిణామాల నేపథ్యంలో ఇందిర సిఫార్సుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 (1)లోని అంతర్గత అత్యవసర పరిస్థితి నిబంధన వినియోగించుకుని నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1975 జూన్ 25 అర్ధరాత్రి 11.45 నిమిషాలకు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే విపక్ష నాయకులు జయప్రకాశ్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, మొరార్జీ దేశాయ్ అరెస్టయ్యారు. అంతేగాక దేశవ్యాప్తంగా వివిధ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు ఇలా దాదాపు 11 లక్షల మందిని జైళ్లల్లో నిర్బంధించారు. అందులో కార్మిక, విద్యార్థి, యువజన, రైతు సంఘాల నాయకులతో పాటు సామాజిక కార్యకర్తలను పెద్దసంఖ్యలో అరెస్టు చేశారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ వివాదాస్పదంగా వ్యవహరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 1976 ఏప్రిల్‌లో ఢిల్లీలోని పలు మురికివాడల ప్రజలను ఆయన బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించారు. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నిలువ నీడను కోల్పోయారు.
ఆర్ఎస్ఎస్ పాత్ర..
ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఉద్యమాలు చేశారు. అప్పట్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దేశంలో జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ మాస పత్రికలు, పక్ష పత్రికలు ప్రచురితం అయ్యేవి. వాటి ద్వారా ఇందిర సర్కారు తీరును ఆర్ఎస్ఎస్ ఎండగట్టేది. ‘సత్య సమాచార్’ పేరుతో తాజా వార్తల బులెటిన్ ప్రచురితం అయ్యేది. ఈ ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1975 జులై 4న దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)ను బ్యాన్ చేశారు.1975 జూన్ 30న నాటి ఆర్ఎస్ఎస్ చీఫ్ బాలాసాహెబ్ దేవ్‌రస్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు.
కాంగ్రెస్ ఘోర పరాజయం..
1976 వచ్చేసింది. ఇందిరాగాంధీ పాలనా కాలం పూర్తయింది. మళ్లీ ఇందిరా గాంధీ ఓ ట్విస్ట్ ఇచ్చారు. లోక్‌సభ గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లుగా 1976 ఫిబ్రవరి 4న సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది సైతం ఎమర్జెన్సీని అలాగే కొనసాగించారు. 1977 జనవరి 18న రాజకీయ ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 1977 జనవరి 24న జనతా పార్టీని ఏర్పాటు చేశారు. మొరార్జీ దేశాయ్ ఈ పార్టీకి సారథ్యం వహించారు. 1977 సంవత్సరం మార్చి 16 నుంచి 20 వరకు సార్వత్రిక ఎన్నికలు కొనసాగాయి. అనుకున్నట్లు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. ఇందిర ప్రధాని పదవిని కోల్పోయారు. జనతా పార్టీ 345 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో.. దేశంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లుగా 1977 మార్చి 21న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అధికారికంగా 1977 మార్చి 23 వరకు ఎమర్జెన్సీ కొనసాగింది. 1977 మార్చి 24న దేశ నూతన ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ ప్రమాణ స్వీకారం చేశారు.